పోలీసు కస్టడీలో ఉండగా నాపై హత్యాయత్నం

  • గుంటూరు ఎస్‌పికి రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చంపుతామని బెదిరించారని, తీవ్రంగా కొట్టి హింసించారని గుంటూరు ఎస్‌పికి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోమని సిబిసిఐడి అదనపు డిజి సునీల్‌కుమార్‌, ఐజి సీతారామాంజనేయులు, సిఐడి ఎస్‌పి విజయపాల్‌ లాఠీలు, రబ్బరు షీట్లతో తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుండెలపై ఆపరేషన్‌ చేసిన చోట చేయివేసి గట్టిగా నొక్కి గుండె నొప్పి వచ్చేలా చేశారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపిగా ఉన్న కనుమూరి రఘురామ కృష్ణరాజును సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనను కొట్టి చంపబోయారని, గుండెలపై తన్నారని, కాళ్లపై కొట్టారని పార్లమెంటు స్పీకర్‌కు లేఖ రాశారు. విచారణ అనంతరం అతన్ని గుంటూరు జనరల్‌ ఆస్పత్రికి తరలించగా గాయాలు లేవని జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ పద్మలత రిపోర్టు ఇచ్చారు. దీనిపై కోర్టుకు వెళ్లగా సికింద్రాబాద్‌ మిలటరీ ఆస్పత్రిలో రఘురామకు పరీక్షలు నిర్వహించి కాళ్లలో పగుళ్లు ఉన్నాయని నిర్ధారించారు. ఈ ఘటన అనంతరం అతను ఎపికి రాకుండా పోలీసు అధికారులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉండి నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన రఘురామ సోమవారం గుంటూరు ఎస్‌పిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను పివి సునీల్‌కుమార్‌, సీతారామాంజనేయులు, విజయపాల్‌ లాఠీలు, రబ్బరు షీట్లతో కొట్టారని తెలిపారు. జగన్‌ను ఏమీ అనొద్దని హెచ్చరించారని పేర్కొన్నారు. దీనిపై వారి ముగ్గురితోపాటు అప్పటి సిఎం జగన్‌పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని రఘురామ కోరారు.

➡️