విద్యార్థిని ఆత్మహత్యపై కొనసాగుతున్న దర్యాప్తు

Mar 30,2024 22:05 #investigation, #student's suicide

లైంగిక వేధింపులే కారణమంటున్న విద్యార్థి సంఘాలు
ప్రజాశక్తి -మధురవాడ, కలెక్టరేట్‌ విలేకరులు (విశాఖపట్నం) :విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ డిప్లొమో చదువుతూ గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డ అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తమ కుమార్తె చనిపోయే ముందు వాట్సాప్‌లో పంపిన సందేశాల ప్రకారం లైంగిక వేధింపులే కారణమని పేర్కొంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు కళాశాలలో ఎవరెవరితో సన్నిహితంగా ఉండేది? అన్న విషయాలను తెలుసుకుంటున్నారు. మరణించడానికి ముందు కుటుంబీకులతో చేసిన వాట్సాప్‌ ఛాటింగ్‌పైనా ఆరా తీస్తున్నారు. శనివారం విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని, ఆ నివేదిక ఆధారంగా మరికొంత దర్యాప్తు జరిపి వివరాలు వెల్లడిస్తామని పిఎం.పాలెం సిఐ రామకృష్ణ తెలిపారు. కెజిహెచ్‌లో విద్యార్థిని మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు సందర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
విద్యార్థి మృతి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌
విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌ఒ ఆధ్వర్యంలో శనివారం కొమ్మాదిలోని చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద, కెజిహెచ్‌ మార్చురీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆయా చోట్ల ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు, గర్ల్స్‌ కన్వీనర్‌ పల్లవి, పిడిఎస్‌ఒ జిల్లా అధ్యక్షులు పి.విశ్వనాధ్‌ మాట్లాడారు. లైంగిక వేధింపులు తాళలేకే సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కళాశాల యాజమాన్యం, పోలీసులు చెబుతున్న విషయాల్లో వాస్తవం లేదన్నారు. అనంతరం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ అప్పారావుకు వినతిపత్రం అందజేశారు. కెజిహెచ్‌ వద్ద మృతురాలి కుటుంబీకులు మాట్లాడుతూ ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️