- ‘ వి రన్ ఫర్ అనంతపురం’ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), యాంటీ నార్కోటిక్స్ పోలీస్ విభాగం ”ఇగల్”, అహుడా, వి వైబ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘వి రన్ ఫర్ అనంతపురం’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నుంచి 10కె, 5కె, 3కె రన్‌లను ప్రారంభించారు. యువత, విద్యార్థులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులు శాప్ ఛైర్మన్ రవి నాయుడు, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అహుడా ఛైర్మన్ వరుణ్, నిర్వాహకులు సజ్జ రాగవీణ, అడిషనల్ ఎస్‌పి పాల్గొన్నారు. రవినాయుడు మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువత పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అనంతపురం జిల్లాను క్రీడా హబ్‌గా మారుస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.