- ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు మాజీ సిజెఐ ఎన్‌వి రమణ పిలుపు
రాయ్ పుర్ : ఆంధ్రులు ఎక్కడున్నా..వారికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బాసటగా నిలవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ తెలుగు మహా సంఘం ద్వితీయ మహాసభ శనివారం రారుపుర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు మాతృభాషా, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహకారం అందించాలన్నారు. పదేళ్ల క్రితం ప్రపంచంలో తెలుగు రెండోస్థానంలో ఉండగా నేడు నాలుగో స్థానానికి దిగజారిందన్నారు. ఏపిలో గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 85ను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించ ుకోవాల్సి ఉందని, ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు. ఆత్మీయ అతిథిగా హాజరైన రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు పది కోట్ల మంది తెలుగు ప్రజలు నివసిస్తుంటే, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ఇంకా విదేశాలలో దాదాపు ఐదు కోట్ల మంది ఉన్నారన్నారు.
దేశంలో హిందీ తర్వాత తెలుగునే ఎక్కువగా మాట్లాడుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో తెలుగును అక్కడి ప్రభుత్వం అధికార భాషగా గుర్తించిందని, ఆ దిశగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరారు. శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకరరావు మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న తెలుగు వారిలో బిసిలకు సంబంధిత ధ్రువ పత్రాలను ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ తెలుగు మహా సంఘం అధ్యక్షులు రాళ్లపల్లి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటులు సాయికుమార్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.