అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

 పిసిసి చీఫ్‌ షర్మిల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడే నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. అంగన్‌వాడీలను ప్రభుత్వం పిలిచి చర్చలు జరపాలని కోరారు. వీరికి వేతనం రూ.26 వేలకు పెంచాలని, గ్రాట్యూటీ ఉత్తర్వులు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హెల్పర్ల పదోన్నతులకు నిర్ధిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన అంగన్‌వాడీల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

➡️