అంగన్‌వాడీ ఆగ్రహం

Mar 10,2025 23:48 #Anganwadi issues, #Dharna
  • ఆంక్షలను అధిగమించి మహాధర్నాకు వేలాదిగా హాజరు
  • హామీలు అమలు చేయాలని డిమాండ్‌
  • మండలిలో నిలదీస్తాం : కెఎస్‌ లక్ష్మణరావు శ్రీ భారీగా మోహరించిన పోలీసులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : హామీలు అమలు చేయని ప్రభుత్వాల వైఖరి పట్ల అంగన్‌వాడీల ఆగ్రహానికి ధర్నా చౌక్‌ వేదికైంది. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు), ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎఫ్‌టియు) సంఘాల ఆధ్వర్యాన మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి తరలివచ్చిన వేలాదిమంది అంగన్‌వాడీలతో విజయవాడలోని ధర్నాచౌక్‌ కిక్కిరిసిపోయింది. జిల్లాల నుండే కదలనీయకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ పెట్టిన ఆంక్షలను అంగన్‌వాడీలు అధిగమించారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ వీరు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. దీంతో ధర్నాచౌక్‌లో భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు. లెనిన్‌సెంటర్‌వైపు రాకుండా బారీకేడ్లు అడ్డుపెట్టారు ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ కార్మికుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నాయని అన్నారు. అంగన్‌వాడీల చారిత్రక సమ్మె సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపిందని, పలు హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని కోరితే చేయడం లేదని అన్నారు. చర్చల సందర్భంగా రాసుకున్న మినిట్స్‌లో ఒక రకంగానూ, అనంతరం ఇచ్చిన జిఓల్లో మరొక రకంగానూ పేర్కొన్నారని తెలిపారు. మట్టి ఖర్చులకు రూ.20 వేలు ఇస్తామని ఒప్పుకున్నారని, జిఓలో మాత్రం రూ.15 వేలు మాత్రమే ఇస్తామని పేర్కొన్నారని చెప్పారు. కార్మికులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఐక్య పోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వ విధానాలు మార్చవచ్చని అన్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంధ్రనాథ్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని అన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు పి.ప్రసాదు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మె జరిగిన సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వారంతా ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా అందరూ శిబిరాల వద్దకు వచ్చారని అన్నారు. నమ్మించి ఓట్లేయించుకున్న తరువాత ఏమీ ఎరుగనట్లు వ్యవహరించడం కూటమి పాలకులకే చెల్లించదని తెలిపారు.

నమ్మించి మోసం చేశారు

అంగన్‌వాడీలను ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందనిఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ మాట్లాడుతూ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను 2024 జులై నుండే అమలు చేస్తామని చెప్పారని, పెంచిన వేతనాలు అగస్టు నుండి పొందొచ్చని చెప్పారని ఇంతవరకు అతీగతి లేదని చెప్పారు. వేతనాలు విషయం తేల్చేవరకూ పోరాటం ఆగేది లేదని హెచ్చరించారు. పైగా ధర్నాకు వస్తున్న వారిపై ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని, ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడిందని పేర్కొన్నారు. ఇటువంటి వాటికి భయపడేది లేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఎఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాకముందు చెప్పిన మాటకు, ముఖ్యమంత్రి అయ్యాక చెబుతున్న మాటలకు పొంతన లేదని విమర్శించారు. రాష్ట్రంలో అతి తక్కువ గౌరవవేతనంతో అంగన్‌వాడీలు పనిచేస్తున్నారని, అయినా ప్రభుత్వాలకు కనికరం లేదన్నారు. ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎఫ్‌టియు) రాష్ట్ర కార్యదర్శి వి.ఆర్‌.జ్యోతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కనీస స్పందన లేదని పేర్కొన్నారు.ఇదే పద్ధతి అనుసరిస్తే సమ్మె చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పూర్వ కార్యదర్శి రోజా, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, కార్యదర్శులు ధనలక్ష్మి, పిఓడబ్ల్యు నాయకులు పద్మ తదితరులు మాట్లాడారు. ధర్నాకు అంగన్‌వాడీ నేతలు బేబీరాణి, ప్రేమ, భారతి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, ఎఐటియుసి నాయకులు వెంకటసుబ్బయ్య, ఐఎఫ్‌టియు నాయకులు పొలారి, వెంకటసుబ్బయ్య, రమణ, మోహన్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

పిడిఎఫ్‌ సంపూర్ణ మద్దతు : కెఎస్‌ లక్ష్మణరావు

అంగన్‌వాడీల సమ్మెకు పిడిఎఫ్‌ తరుపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం మండలిలో తాము చర్చకు వాయిదా తీర్మానం ఇస్తామని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. ధర్నాకు హాజరైన ఆయన మాట్లాడుతూ గతంలో అంగన్‌వాడీలు 43 రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వం చర్చలు జరిపిందని తెలిపారు. దానిలో రాజకీయాలకు సంబంధం లేదని, చర్చలు ప్రభుత్వ పరంగానే జరిగాయనే విషయాన్ని ఇప్పటి కూటమి పాలకులు గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. అంగన్‌వాడీలు వారి డిమాండ్ల పరిష్కారం వరకూ పోరాడాలని, ఈ విషయంలో ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు.

➡️