- ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు కొత్తగా ‘బాల సంజీవని’ యాప్‌లో రకరకాల మార్పులు చేశారని, ఈ యాప్ వల్ల అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురువుతున్నారని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ తెలిపింది. అంగన్వాడీలకు యాప్ భారం తగ్గించాలని, ట్యాబ్‌లు ఇవ్వాలని ఐసిడిఎస్ డైరెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డికి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.బేబిరాణి, కె.సుబ్బరావమ్మ గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల అంగన్వాడీల ఫేస్ రికగ్నైజేషన్‌కు, లబ్ధిదారులకు ఇకెవైసి అమలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బాల సంజీవని యాప్ అమలుకు నెట్ వర్క్ సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్‌లలో ఈ యాప్ ఒపెన్ కావడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.