అంగన్‌వాడీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి

  • ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్‌

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్లు యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… అంగన్‌వాడీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. అంగన్‌వాడీల ఐక్య పోరాటాల ఫలితంగా వర్కర్లకు కనీస వేతనం రూ.11,500, హెల్పర్లకు రూ.ఏడు వేలు, మినీ వర్కర్లకు రూ.ఏడు వేలు సాధించుకున్నామని తెలిపారు. సెంటర్ల అద్దెలు, ప్రసూతి సెలవులు, వర్కర్లకు సూపర్‌వైజర్ల పోస్టుల్లో 50 శాతం ఉద్యోగోన్నతులు, ఉద్యోగ విరమణ వయోపరిమితి, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర వాటిని సాధించుకున్నామని వివరించారు. అంగన్‌వాడీ వర్కర్లను మూడో తరగతి, హెల్పర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, పింఛను, పిఎఫ్‌, ఇఎన్‌ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. రాబోయే కాలంలో ఈ సమస్యలన్నింటిపై పోరాటం కొనసాగుతుందన్నారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీల బిల్లులను భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ నాగేంద్రకుమార్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️