- కౌలు రైతు చట్టంపై ప్రజాభిప్రాయసేకరణ
- వ్యవసాయ సంక్షోభంపై మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఒకే సారి ఇవ్వలేమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు చెప్పారు. వ్యవసాయ సంక్షోభంపై మండలిలో మంగళవారం జరిగిన లఘు చర్చలో పిడిఎఫ్ సభ్యుడు కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ సొమ్మును విడతలవారీగా కాకుండా ఒకే సారి ఇస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎంకిసాన్ సమ్మాన్ నిధి సొమ్ముతో పాటు మూడు వాయిదాల్లోనే తాము చెల్లిస్తామని చెప్పారు. రూ.12,500 ఒకే సారి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తరువాత పిఎంకిసాన్‌కు ముడిపెట్టి విడతల వారిగా ఇచ్చారని, తాము కూడా రూ.14 వేలు మూడు విడతలలో ఇస్తామని చెప్పారు. కేంద్రం ఆరు వేల రూపాయలను యదాతథంగా ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కౌలు రైతు చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు రైతులు, రైతు సంఘాలతో పాటు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టినట్టు తెలిపారు. 2019లో వైసిపి అధికారంలోకి రాగానే తీసుకువచ్చిన కౌల్దారి చట్టం వల్ల రైతులు ఇబ్బందులుపడుతున్నారని, భూ యజమాని సంతకం ఉంటేనే ప్రభుత్వం సాగు ధృవీకరణపత్రం(సిసిఆర్‌సి) ఇచ్చేలా రూపొందించిన నిబంధనల వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించి చట్టం మార్పునకు తగిన కసరత్తు జరుగుతోందని ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాలు, వామపక్షాలు, ప్రజలతో చర్చిస్తున్నట్టు ఆయన వివరించారు. మండలిలో ప్రతిపక్షనాయకుడు బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ ఎక్కువ మంది కౌలు రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో 2019లో వైసిపి ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. ఆర్‌బికేల ద్వారా రైతులకు అనేక సదుపాయాలు కల్పించామన్నారు. వైసిపి హయంలో ఆత్మహత్యలు తగ్గాయని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు.తాము వివిధ పథకాల ద్వారా రైతులను ఆదుకున్నామని కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులు ఏ విధంగా ఆదుకోలేదన్నారు. ధరలేక మిర్చి, వరి, పత్తి రైతులు నష్టపోయారని తెలిపారు. 2019లో టిడిపి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్ము రూ.1,180 కోట్లు తాము చెల్లించామని తెలిపారు. అలాగే 2019 నుంచి 2024 వరకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద తాము రూ.3,240 కోట్లు చెల్లించామని కానీ టిడిపి ఎప్పుడు ఇంత సొమ్ము రైతులకు ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా బొత్సకు, అచ్చెన్నాయడుకి వాగ్వావాదం జరిగింది. తాము రుణమాఫికి బాండ్లు ఇస్తే వైసిపి ప్రభుత్వం చెల్లించలేదని గుర్తు చేశారు. 2016లో బాండ్లు ఇచ్చారని, 2019 వరకు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉందని బొత్సా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బాండ్ల కాపీలను సభలో ప్రదర్శించి ఎద్దేవా చేశారు. ఎవరైనా ఎన్నికలకు ముందు బాండ్లు ఇస్తే తదుపరి ప్రభుత్వం చెల్లించడం అనవాయితీ అని మూడేళ్ల పాటు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసి తరువాత తమను చెల్లించమనడం తగదని బొత్సా అన్నారు. రైతులకు మేలు చేసే నిర్ధిష్టమైన విధానం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. బొత్సా ఆరోపణలపై స్పందించిన మంత్రి. వైసిపి హయంలో రైతు భరోసా కింద రూ.7500 ఇచ్చి వ్యవసాయ పరంగా మిగతా అన్ని పథకాలను నిర్వీర్యం చేశారని, దీని వల్ల క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ నిర్వీర్యమై పోయిందన్నారు. కేంద్రం ఇచ్చే 17 వ్యవసాయ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా వీటిని కూడా నిరుపయోగం చేసి కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించారని తెలిపారు. ఉద్యాన రైతులకు స్పింక్రర్లు, స్పేయర్ల సరఫరా నిలిపివేశారని, భూ సార పరీక్షలు జరపలేదని, వర్షపాతం నమోదుకు రెయిన్‌గేజ్ మీటర్లను పెట్టలేదని, ఆర్‌బికేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలాగే , రేషన్ కార్డులపై ఇస్తున్న బియ్యం ప్రజలు తినడంలేదని, సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజనంలో ఈ బియ్యం వాడితే విద్యార్థులు తినడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందువల్ల తాము సన్నరకాల ధాన్యం ఉత్పత్తికి శాస్త్రవేత్తలు, మిల్లర్లు, వ్యవసాయ నిపుణులతో చర్చిస్తున్నామని వచ్చే సీజన్ నుంచి వంగడాల మార్పుతో సేద్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఇంకా ఈచర్చలో
పులివెందులలో జూదం ఆడి నష్టపోయిన వైసిపి కార్యకర్తలు చనిపోతే వారిని రైతు ఆత్మహత్యలుగా చిత్రీకరించి సొమ్ము ఇచ్చారని టిడిపి సభ్యులు రాంగోపాల్‌రెడ్డి చేసిన ఆరోపణపై వైసిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ చేస్తే తాను నిరూపిస్తానని గోపాలరెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పర్చూరి అశోక్‌బాబు, మర్రిరాజశేఖర్, కెఎస్ లక్ష్మణరావు, తదితరులు మాట్లాడారు.