- నేడు అంకురార్పణ
- 4న సిఎం పట్టువస్త్రాలు సమర్పణ
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకూ 9 రోజుల పాటు వేడుకగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఇఒ శ్యామలరావు తెలిపారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రవాణా నిమిత్తం ఆర్‌టిసి 1200 బస్సులను ఏర్పాటు చేసింది. బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వచ్చేందుకు ఆర్‌టిసి సేవలందించనుంది. ప్రతి నిమిషానికి ఓ బస్సు తిరుమలకు వెళ్లేలా ఆర్‌టిసి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇలా..
బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు తిరుమాడవీధుల్లో ప్రారంభమవుతాయి.
రాకపోకలపై నిషేధం..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొండపైకి వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8వ తేదీ అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి.. ప్రత్యేక దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయనుంది..