- విద్యుత్ వినియోగదారులపై 8,113 కోట్లు భారం
- ఎపిఇఆర్‌సికి సమర్పించిన డిస్కంలు
- 18న విచారణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వినియోగదారులపై మరో భారాన్ని మోపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ట్రూఅప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో డిస్కంలు వినియోగదారుల నడ్డి విరిచాయి. తాజాగా మరో ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో భారీగా మోపేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్‌సి)కి ప్రతిపాదనలు పంపాయి. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పిపిసిఎ) పేరుతో మూడు డిస్కంలు రూ.8113కోట్లు ఇఆర్‌సికి ప్రతిపాదించాయి. 2022-23 ఏడాది సర్దుబాటు పేరుతో త్రైమాసికాల వారీగా ఒక్కో డిస్కం నాలుగు పిటిషన్లు ఇఆర్‌సికి సమర్పించాయి. విద్యుత్ బిల్లుల భారం భరించలేకే ప్రజలు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు మోపబోమని టిడిపి కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరిచింది. అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులను చెల్లించలేక వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు మరో భారం మోపితే వినియోగదారుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. 2022-23కి సంబంధించిన రూ.8113కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలపై ఈ నెల 14వ తేదిలోపు అభ్యంతరాలు పంపాలని ఎపిఇఆర్‌సి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదిన ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రతిపాదనలపై విచారణ నిర్వహిస్తామని వెల్లడిస్తామని తెలిపింది. విచారణ తరువాత ప్రజలపై ఎంత భారం మోపుతారో వేచిచూడాల్సి ఉంది.
2023-24 సర్దుపోటు కూడా సిద్ధం
వినియోగదారులపై మూడో సర్దుబాటు చార్జీలు వేసేందుకు కూడా డిస్కంలు సిద్ధమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8957.42 కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. గతేడాది సర్దుబాటు మొత్తం రూ.11,826.42 కోట్లుగా డిస్కంలు తేల్చాయి. వీటిల్లో రూ.2,869 కోట్లు నెల నెలా సర్దుబాటు ఛార్జీలతో డిస్కంలు ఇప్పటికే వసూలు చేశాయి. ఇవి పోనూ ఇంకా రూ.8,957.42 కోట్ల సర్దుబాటు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నాయి.