- 11,826కోట్ల ట్రూ అప్ వడ్డనకు డిస్కంల ప్రతిపాదన
- 19లోపు అభ్యంతరాలు తెలపాలన్న ఎపిఇఆర్‌సి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా విద్యుత్ వినియోగదారులపై భారం తప్పడం లేదు. ట్రాఅప్, సర్దుబాటు అంటూ వివిధ రకాల చార్జీల పేరుతో భారాలపై భారాలు మోపుతున్నాయి. చార్జీలు పెంచబోమంటు ఎన్నికల సమయంలో హామీలిచ్చి అందుకు భిన్నంగా ప్రజలపై భారాలు వేస్తున్నాయి. దీంతో అసలు విద్యుత్ యూనిట్ ధర కంటే వీటి ధర అధికంగా ఉంది. పెరిగిన బిల్లులు చూసుకుంటున్న వినియోగదారులు చెల్లించలేక లబోదిబోమం టున్నారు. తాజాగా 2023-24 సంబంధించిన రూ.11,826.42 కోట్లను ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్‌పిపిసిఎ) పేరుతో వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఈఆర్‌సి)ని కోరాయి. డిస్కంలు పంపిన ప్రతిపాదనలపై ఈ నెల 19వ తేదిలోపు అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు పంపాలని కమిషన్ కార్యదర్శి సోమవారం ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రతిపాదించిన రూ.11,826 వేల కోట్లలో రూ.3700కోట్లను డిస్కంలు ఇప్పటికే వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేశాయి. నెల నెల సర్దుబాటు పేరుతో ప్రతి నెల రూ.0.40లు 2023 మార్చి నుంచి 2024 ఏప్రిల్ వరకు వినియోగదారులపై భారం మోపింది. ఇంకా వసూలు చేయాల్సింది రూ.8,126కోట్లు ఉందని దీనికి కూడా అనుమతి ఇవ్వాలని పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ఇప్పటికే 2021-22 ట్రూఅప్ పేరుతో రూ. 3082.99కోట్లు కాకుండా 2023-24 సంవత్సరంలో సర్దుబాటు పేరుతో ప్రతి నెల రూ0.40ల చొప్పున రూ.3,700కోట్లు వసూలు చేశాయి. ఇవి కాకుండా 2022-23 సర్దుబాటు పేరుతో రూ.6,072కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని 10 రోజుల క్రితమే ఎపిఇఆర్‌సి ఉత్తర్వులు విడుదల చేసింది. ఇవి చాలదన్నట్లుగా ఇప్పుడు మళ్లీ మరో ఎనిమిది వేల కోట్ల రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. ఏ నెలకు ఎంత భారం మోపాలనే ప్రతిపాదనలు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మార్కెట్ నుంచి యూనిట్‌కు సరాసరి రూ.8లకు సుమారు 12వేల మిలియన్ యూనిట్లు(ఎంయు)కొనుగోలు చేశాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న జెన్‌కో ప్లాంట్లలో సుమారు 7,500 ఎంయుల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి.
డిస్కంల వారీగా ఇలా
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటేడ్ (ఎపిఎస్‌పిడిసిఎల్) రూ.3,968.67కోట్లను కమిషన్‌కు ప్రతిపాదించింది. ఇందులో రూ.1,148.89కోట్లు ఇప్పటికే ప్రతి నెల రూ.0.40ల చొప్పున వసూలు చేసింది. ఇంకా రూ.2,819.78కోట్లు వసూలు చేయాలని కోరింది. 7,433.746 మిలియన్ యూనిట్లను యూనిట్‌కు రూ.6.90ల చొప్పున రూ.5,358.75 కోట్లతో బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. ఇందులో స్వల్ప కాలిక ఒప్పందాల పేరుతో 4,221.42 ఎంయులను సరాసరి రూ.8.31లకు కొనుగోలు చేశారు.అత్యధికంగా ఏప్రిల్‌లో రూ.9.69ల, సెప్టెంబర్‌లో రూ.9.66 చొప్పు కొనుగోలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిట్(ఎపిసిపిడిసిఎల్) రూ.2,145.69కోట్లు ప్రతిపాదించింది. ఇందులో రూ.625.74కోట్లు సర్దుబాటు కింద ప్రతి నెల వసూలు చేసింది. ఇంకా రూ.1,520.46 వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఎపిఇపిడిసిఎల్ ఎంత భారం ప్రతిపాదించే అంశాలను పొందుపరచలేదు. బహిరంగ మార్కెట్ నుంచి 7,433.746 ఎంయులను రూ.5,300ల కోట్లతో కొనుగోలు చేసింది.