రాజధానిలో మరో రూ.20 వేల కోట్లతో అభివృద్ధి పనులు

  • ఎక్కువ మంది ఇళ్లు కోల్పోకుండా రోడ్ల నిర్మాణం : మంత్రి నారాయణ

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన రూ.22 వేల కోట్ల టెండర్లకు సిఆర్‌డిఎ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని, సోమవారం జరిగే సమావేశంలో మరో రూ.20 వేల కోట్లకు అనుమతులు పొందుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రాజధానిలోని రహదారులు, పలు నిర్మాణాలను పరిశీలించేందుకు ఆయన మంగళగిరి, ఎర్రబాలెం, నవులూరు, వెంకటపాలెంలో శనివారం పర్యటించారు. 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసే ఇ11, ఇ13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైపాస్‌ నిర్మాణ పనులు, వెంకటపాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వచ్చామని తెలిపారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో తూర్పు నుండి పడమరకు 16 రోడ్లు, ఉత్తరం నుండి దక్షిణానికి 18 రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. సీడ్‌ కేపిటల్‌ నుంచి ఇ11, ఇ13, ఇ15 రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నామన్నారు. రోడ్ల నిర్మాణానికి అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని తెలిపారు. ఇ11 రోడ్డు ఎయిమ్స్‌ పక్కన సర్వీసు రోడ్డులో కలుస్తుందని, ఇ13 రోడ్డు డిజిపి కార్యాలయం పక్కన కలుస్తుందని వివరించారు. రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోయేవారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

➡️