ఫార్మా విషవాయువుకు మరో కార్మికుడు బలి

ప్రజాశక్తి – పరవాడ (అనకాపల్లి జిల్లా) : పరవాడ ఫార్మా సిటీలోని ఠాగూర్‌ లేబొరేటరీలో విషవాయువు లీకై అస్వస్థతకు గురైన కార్మికుల్లో గురువారం తెల్లవారుజామున సిహెచ్‌.వీరశేఖర్‌ మృతిచెందాడు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఠాగూర్‌ లేబొరేటరీలో మంగళవారం అర్ధరాత్రి రియాక్టర్‌ కమ్‌ రిసీవర్‌ ట్యాంక్‌ (జిఎల్‌ఆర్‌ -325) నుంచి హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ (విషవాయువు) లీకైన ఘటనలో ఒడిశాకు చెందిన అమిత్‌బాగ్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో అస్వస్థతకు గురైన 29 మందిలో కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామానికి చెందిన సిహెచ్‌.వీరశేఖర్‌ గురువారం తెల్లవారుజామున మరణించారు.

సిపిఎం, సిఐటియు నాయకుల పరామర్శ

విశాఖ నగరంలోని కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు, సిఐటియు అనకాపల్లి జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు పరామర్శించారు. మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి. కుమార్‌ పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

ఠాగూర్‌ లేబొరేటరీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారికి సంబంధించి ఒక్కొక్క కుటుం బానికీ రూ.40 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వను న్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ప్రకటించారు. ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో ఆయన మాట్లాడారు. కార్మికులకు న్యాయం చేయాలని సంస్థ యాజమాన్యంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు యాజమాన్యంతో ఒప్పందం జరిగిందన్నారు. విషవాయువు లీకేజీ ఘటనపై విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

➡️