ఇది బిజెపి ఫేర్‌వెల్ బడ్జెట్
ఈ బడ్జెట్ బిజెపి ప్రభుత్వ ఫేర్‌వెల్ బడ్జెట్. దశాబ్ద కాలం పాలనలో ప్రజా వ్యతిరేక బడ్జెట్‌లతో బిజెపి ప్రభుత్వం షేమ్‌ఫుల్ రికార్డును సృష్టించింది. ఈ రికార్డు బ్రేక్ కాదు. ఎందుకంటే సానుకూల ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయం ఆసన్నమైంది.
– అఖిలేశ్ యాదవ్, మాజీ సిఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
ఇది మోడీ సర్కారు చివరి బడ్జెట్
మోడీ సర్కారుకు ఇదే చివరి బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ పేదలు, మహిళలు, యువత, రైతులుపై బడ్జెట్ ఫోకస్ చేస్తుందని చెప్పారు. కనీసం దేశంలో ఆ నాలుగు వర్గాల ప్రజలైనా ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.
– ఉద్ధవ్ థాక్రే, మాజీ సిఎం, శివసేన (యుబిటి) చీఫ్
బడ్జెట్ లోపభూయిష్టం
బడ్జెట్ లోపభూయిష్టంగా ఉన్నదని బిజెపి మాజీ మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ (ఎస్‌ఎడి) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ అన్నారు. యువత, మహిళలు, రైతుల కోసం బడ్జెట్‌లో ఏమీ లేదని తెలిపారు. జులైలో బడ్జెట్‌ను ప్రవేశపెడతామని వారు (కేంద్రం) చెప్పినపుడు వారిలో అహంకారం కనిపించిందని చెప్పారు. – ఎస్‌ఎడి ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్
ప్రజా వ్యతిరేక బడ్జెట్
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ విమర్శించారు. దీనితో మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక తీరు బయటపడిందని అన్నారు. మోడీ హామీ అయిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించారా, లేదా అన్నదానిపై కేంద్ర మంత్రి నిర్మల తెలియజేస్తారని ఆశతో తాము ఎదురు చూశామని తెలిపారు. టాక్స్ స్లాబ్‌ల విషయంలో మధ్య తరగతికి ఊహించిన ఉపశమనం లభించలేదని కమల్‌నాథ్ చెప్పారు. – కమల్‌నాథ్
బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా
కేంద్రబడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నాను నరేంద్రమోడీ ప్రభత్వుం ఇచ్చింది. బడ్జెట్‌లో పదేళ్ల అభివృద్ధి గురించి చెప్పారని ఆచరణలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. పేదరికం తగ్గితే 80కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తారని ప్రశ్నించారు. రుణ వ్యవస్థపై చెప్పిన గణాంకాలు కాకిలెక్కలే అని పేర్కొన్నారు. పన్నుల విధానంలో ఉద్యోగులకు నిరుత్సాహం కలిగించిందని తెలిపారు. – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ