ప్రజాశక్తి-అమరావతి : సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో వర్మకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అనకాపల్లి జిల్లా, రావికమతం, గుంటూరు జిల్లా, తుళ్లూరు, ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వర్మ వేసిన కేసులో జస్టిస్ ఎన్ హరినాథ్ మంగళవారం తీర్పు చెప్పారు. ‘రూ.10 వేల చొప్పున రెండు స్వీయ పూచికత్తులు సమర్పించాలి. దర్యాప్తునకు సహకరించాలి. పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలి’ అని షరతులు విధించారు.
హోంమంత్రిపై చెక్‌బౌన్స్ కేసు కొట్టివేత
హోంమంత్రి అనితపై విశాఖపట్నం కోర్టులోని చెక్‌బౌన్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. మంగళవారం కేసు విచారణకు హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అనిత తరపున న్యాయవాది వివి సతీష్ వాదిస్తూ.. చెక్‌బౌన్స్ కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు, హోంమంత్రి నిర్ణయించుకున్నారన్నారు. రాజీలో భాగంగా రూ.10 లక్షలు వేగి శ్రీనివాసరావుకు అందజేసినట్లు చెప్పారు. మరో రూ.5 లక్షలు చెక్కు రూపంలో వేగి శ్రీనివాసరావు తరపున న్యాయవాదికి అందజేస్తున్నామన్నారు. మంత్రి అనిత, శ్రీనివాస్‌రావు కేసును రాజీ చేసుకున్నట్లు చెప్పడంతో హైకోర్టు, విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్‌బౌన్స్ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. తన వద్ద రూ.70 లక్షలు తీసుకున్న అనిత ఆ మేరకు చెక్కులు ఇచ్చారని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని శ్రీనివాసరావు కింది కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఇద్దరూ రాజీ చేసుకున్నామని, కింది కోర్టు కేసును కొట్టేయాలని హైకోర్టును అనిత ఆశ్రయించారు. ఇరుపక్షాలను విచారించాక హైకోర్టు కింది కోర్టులోని కేసును కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్‌సి వర్గీకరణ అధ్యయన కమిషన్‌పై పిటిషన్
ఎస్‌సి వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డు ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యాన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘జాతీయ ఎస్‌సి కమిషన్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చట్టబద్ధత లేదు. దీనిని కొట్టేయాలి’ అని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. ఈ కేసులో తమను ప్రతివాదులుగా చేర్చేందుకు అనుమతించాలంటూ పలువురు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై అదేరోజు నిర్ణయం తీసుకుంటామన్నారు.