మే 13న ఎపి అసెంబ్లీ ఎన్నికలు

  • ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌
  • నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఏప్రిల్‌ 25
  • నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఏప్రిల్‌ 29
  • షెడ్యూల్‌ ప్రకటించిన సిఇఓ ముఖేష్‌ కుమార్‌ మీనా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మే నెల 13వ తేదిన పోలింగ్‌ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకే విడతలో ఆ రోజు పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం మధ్యాహ్నాం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్‌ 18వ తేదిన నోటిఫికేషన్‌ విడుదలవుతుందని, ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాల్లో నాలు ఎస్సీలకు, ఒకటి ఎస్‌టిలకు, అసెంబ్లీ స్థానాల్లో ఎస్‌సిలకు, ఏడు ఎస్‌టిలకు రిజర్వు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 4.90 కోట్ల మంది ఓటర్లున్నారని, వీరందరు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఎన్నికల విధుల కోసం 3.82 లక్షల మంది ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగుల సేవలను వినియోగించుకోనున్నట్లు చెప్పారు. అదే విధంగా లక్షకుపైబడి పోలీస్‌, పారామిలటరీ, కేంద్ర బలగాల సేవలను కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్‌విడుదలైన (శనివారం) రోజునుండి ఓటర్ల జాబితాలో తొలగింపు, మార్పులు, చేర్పులకు అవకాశం లేదని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదుకు మాత్రం ఏప్రిల్‌ 25వ తేదీ అంటే నామినేషన్ల దాఖలకు చివరి తేదీ వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 46,165 పోలింగ్‌ స్టేషన్లలో, 12,045 స్టేషన్లు పట్టణాల పరిధిలో ఉండగా మిగిలిన 34,120 పోలింగ్‌ కేంద్రాలు రూరల్‌ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు మరో 219 స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. మొత్తం 1,15,416 (120 శాతం) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఇవిఎం), 1,43,037 బ్యాలెట్‌ యూనిట్స్‌, 1,37,190 వివిప్యాట్స్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎన్నికలకు అయిదు రోజుల ముందు ఓటర్లకు స్లిప్పులు జారీచేస్తామని వివరించారు.

ప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగులు మాత్రమే…
రానున్న ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ, రెగ్యులర్‌ ఉద్యోగుల సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగించుకోమని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందకే వస్తారని, వారి సేవలను కూడా ఎన్నికల కోసం వినియోగించుకుంటున్నామని చెప్పారు. అయితే ఎన్నికల నిర్వహణలో ప్రధాన బాధ్యతలైన ఓటర్ల వెరిఫికేషన్‌, బటన్‌ ప్రెస్సింగ్‌ విధులు వారికి అప్పగించేది లేదని, ఓటర్లకు ఇంకు పూసేందుకు మాత్రమే వినియోగించుకుంటాని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లోనూ టీచర్లే ప్రధాన బాధ్యత వహిస్తారని, ఎన్నికల నిర్వహణలో 60 శాతం మంది టీచర్లే ఉంటారని తెలిపారు. అస్సలు టీచర్లు లేకపోతే ఎన్నికలే లేవని ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. వాలంటీర్ల సేవలను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల కోసం వినియోగించుకోబోమని ఆయన తెలిపారు

➡️