అమరావతి : ఈ నెల 24వ తేదీ నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలయ్యింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను గత ఏడాది జూలైలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 – 26కి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్స్ మొదలవుతాయి. ఈ నెల 28న ఎపి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. జూన్ లో ప్రభుత్వం ఏర్పడిన తరువాత సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ పథ కం అమల్లోకి తీసుకొచ్చారు. మిగిలిన పథకాలను వచ్చే ఆర్థిక ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా … రేపు (ఫిబ్రవరి 11) ప్రభుత్వ విప్ లతో చీఫ్ విప్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీకి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెళ్లారు. ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులపై లోక్ సభ స్పీకర్ కు ఆహ్వానం పలకనున్నారు. ఈ నెల 24 నుంచి ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకావడంతోపాటు ఈ నెల 28వ తేదీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టనున్నారు. ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహించి, ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు.
