రతన్‌ టాటాకు రాష్ట్ర మంత్రివర్గం నివాళి

  • భౌతికకాయాన్ని సందర్శించిన చంద్రబాబు, లోకేష్‌

ప్రజాశక్తి – యంత్రాంగం : ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా మృతికి రాష్ట్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. సచివాలయంలో మంత్రిమండలి సమావేశం గురువారం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే టాటా మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విలువలతో కూడిన వ్యాపారంతో పెద్ద బ్రాండ్‌ను టాటా సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా దానిని సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరని లోటు అని వ్యాఖ్యానించారు. నివాళులర్పించిన అనంతరం చంద్రబాబుతో పాటు విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకున్నారు. టాటా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పారిశ్రామిక వేత్త : పినరయి విజయన్‌
దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేరళ అభివృద్ధికి ఆయన అందించిన మద్దతు ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, టాటా గ్రూప్‌నకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. భారతదేశ పారిశ్రామిక రంగంలో నిజమైన టైటాన్‌ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. దూరదృష్టితో టాటా గ్రూప్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా భారత వ్యాపార రంగంలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పారని అన్నారు.

పారిశ్రామిక సంఘాల నివాళి
వ్యాపార సామాజ్రానికి రతన్‌ టాటా రోల్‌ మోడల్‌ (మార్గదర్శి) అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఫిక్కీ) పేర్కొంది. రతన్‌ టాటా భారతదేశంపై చెరగని ముద్ర వేశారని ఫిక్కీ ప్రెసిడెంట్‌ అనీష్‌ షా పేర్కొన్నారు. రతన్‌ టాటా భారత పరిశ్రమక లెజెండ్‌ అని కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సిఐఐ) ఛైర్మన్‌ సంజీవ్‌ పూరి పేర్కొన్నారు. ఆయన నుంచి తాము ఎన్నో నేర్చుకున్నామని తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలోనూ రతన్‌ టాటా చెరగని ముద్ర వేశారన్నారు.

➡️