- కేబినెట్ ఆమోదముద్ర
- ”పబ్లిక్” కంపెనీగా ఎపిఎండిసి
- కుప్పంలో కేంద్రీయ విద్యాలయం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎస్‌సి వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 59 షెడ్యూల్ కులాలను, వెనుకబాటుతనం, సామాజిక చైతన్యం ఆధారంగా రిజర్వేషన్ల కోసం మూడు కేటగిరీలుగా విభజించినట్లు కేబినెట్ సమావేశ నిర్ణయాలను మీడియాకు వివరించిన రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, కందుల దుర్గేష్‌లు తెలిపారు. గ్రూప్-1 కింద 12 కులాలకు ఒక శాతం రిజర్వేషన్, గ్రూప్-2 కింద 18కులాలకు 6.5శాతం, గ్రూప్-3 కింద 29కులాలకు 7.5శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆర్డినెన్స్ రెండు మూడు రోజుల్లో 26 జిల్లాల్లో అమల్లోకి వస్తుందని, అనంతరం డిఎస్‌సి నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. జనగణన పూర్తయిన తర్వాత జిల్లాల యూనిట్‌గా ఎస్‌సి వర్గీకరణను అమలు చేస్తామని తెలిపారు. ఎపిఎండిసిని పబ్లిక్ కంపెనీగా మార్చడంతో పాటు, రూ.9వేలకోట్ల బాండ్లను జారీ చేసేందుకు అనుమతించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
సిఆర్‌డిఎ పరిధికి సంబంధించిన రెండు పనులు శాసనసభ భవనం (రూ.617.33కోట్లు), హైకోర్టు భవనం రూ. 786.05కోట్ల పనులను ఎల్-1 బిడ్డర్లకు అప్పగించేందుకు ఎపిసిఆర్‌డిఎ అథారిటీ చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.
- మరికొన్ని నిర్ణయాలు
- విశాఖలోని ఐటి హిల్ నెంబరు 3లో రూ.1370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు,12వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌కు 21.16 ఎరాల భూమి కేటాయింపు.
- విజయనగరంలో మహామాయ ఇండిస్టీస్ లిమిటెడ్ ద్వారా సమగ్ర ఉక్కు ప్లాంట్ విస్తరణ.
- విశాఖలో ఆర్సాక్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డేటా సెంటర్, ఐటి క్యాంపస్ ఏర్పాటు
- రాష్ట్రంలో డేటా ఆధారిత ప్రణాళిక, సామర్ధ్య నిర్మాణం ద్వారా వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేసేందుకు నగరాల కోసం రాష్ట్ర వాతావరణ కేంద్రం (ఎస్-సి3) ఏర్పాటు
- ఎపిసిపిడిసిఎల్ పరిధిలోని మూడు పాత జిల్లాల్లో మిగిలిన 199కు సంబంధించిన 11కెవి మిశ్రమ వ్యవసాయ ఫీడర్ల విభజన పనులు చేపట్టడానికి డిపిఆర్‌కు ఆమోదం.
- ఒడిస్సా పవర్ కన్సార్టియం లిమిటెడ్‌కు బలిమెల(చిత్రకొండ) ఆనకట్ట పవర్ హౌస్ (2-30 ఎండబ్ల్యు), జాలాపుట్ డ్యామ్ పవర్‌హౌస్ (3-6ఎండబ్ల్యు) కేటాయింపుకు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం.
- నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో ఏర్పాటు చేయనున్న ఇండిస్టియల్ పార్క్‌కు 87.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎపిఐఐసికి ఉచితంగా కేటాయింపు. ఇదే మండలంలోని నేలటూరులో మరో ఇండిస్టియల్ పార్కు కోసం 220.81 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎపిఐఐసికి ఉచితంగా కేటాయింపు.
- పూల సుబ్బయ్య వెలిగొండలోని 2,4 ప్యాకేజీలకు సంబంధించి నల్లమలజలాశయాన్ని నింపడానికి ,అవసరమైన కీలక పనులకు రూ.106.39 కోట్ల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనలకు ఆమోదం.
- పోలవరం ప్రాజెక్టు మిగిలిన హెడ్ వర్క్ పనులు అప్పగించిన నవయుగ ఇంజనీరింగ్‌కంపెనీ లిమిటెడ్ కు రూ.57.56కోట్ల మొత్తాన్ని తుది బిల్లుతో పాటు చెల్లించాల్సిన 36.37కోట్లు చెల్లించేందుకు ఆమోదం.