- పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల్లో మార్పులు
- రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్‌గా మారనుందని రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎపి డిటిఐ (డిజిటల్ టెక్నాలజీ ఇండిస్టీ), ఎస్‌టిపిఐ (సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు విశాఖలోని విఎంఆర్‌డిఎ వేదికగా నిర్వహిస్తున్న ఎపి డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2025కు ఆయన బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మట్లాడుతూ ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి సాధ్యపడుతుందని తెలిపారు. అభివృద్ధికి ఇన్నోవేషన్ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఎఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్, ఎనర్జీ స్మార్ట్ సొల్యూషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించనున్నాయని తెలిపారు. సామాజిక సమస్యల పరిష్కారానికి ఐటి, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్, స్మార్ట్ టెక్నాలజీస్ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా తీర్చిదిద్దుతామన్నారు. ఉద్యోగాలు పొందేందుకు, కల్పించేందుకు ఇన్నోవేషన్‌తోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలో సమూల మార్పులు తీసుకువస్తామని తెలిపారు. త్వరలోనే టిసిఎస్ రాబోతోందని, రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను నెలకొల్పుతామని, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ ఎంపి ఎం శ్రీభరత్, డిటిఎన్‌ఎఫ్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు, కెడిఇఎమ్ చైర్మన్ బివి.నాయుడు, అలోన్ ఒఎస్ కో-ఫౌండర్ సిపి గుర్నాని, ఎస్‌టిపిఐ డైరెక్టర్ సి.కవిత, ఐటిఎఎపి ప్రెసిడెంట్ లక్ష్మీ ముక్కవిల్లి పాల్గొన్నారు.