- ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
- తొలిసారి ఎస్‌సి వర్గీకరణ అమలు
- మే 15 వతేది వరకు అర్హులైన వారికి అవకాశం
- 44 ఏళ్ల సాధారణ వయో పరిమతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎట్టకేలకు మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజరు రామరాజు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొదటిసారిగా ఎస్‌సి వర్గీకరణను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. వర్టికల్ రిజర్వేషన్ పద్ధతిలో ఎస్సిలను గ్రూప్-1,2,3గా విభజించి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. అదేవిధంగా 3 శాతం స్పోర్ట్స్ కోటాను కూడా అమలు చేయనున్నారు. దరఖాస్తు దారుల అర్హత వివరాలు, రిజర్వేషన్ అమలు, పరీక్ష విధానం, సిలబస్ వంటి అంశాలను పాఠశాల విద్యాశాఖ https://cse.ap.gov.in,https://apdsc.apcfss.in వెబ్‌సైట్‌లలో పొందుపరిచింది. ఈ పోస్టులకు మే 15వ తేది వరకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 16,347 పోస్టుల్లో ప్రభుత్వ, జిల్లా, మండల, మున్సిపల్ పరిషత్ పాఠశాలల్లో 13,192 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా వీటి వివరాలను శనివారమే పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. గిరిజన సంక్షేమ ఆశ్రమం పాఠశాలల్లో 881 పోస్టులు, జువనైల్ వెల్ఫేర్‌లో 15, వికలాంగ పాఠశాలల్లో 31 పోస్టులు చొప్పున భర్తీ చేయనున్నారు. ఎపి రెసిడెన్షియల్, ఎపి మోడల్ స్కూల్, ఎపి సోషల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, గిరిజన గురుకులాల విద్యాసంస్థల్లో 2,228 పోస్టులను భర్తీ చేయనుంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(టిఆర్‌టి) పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ద్వారా నిర్వహించనుంది. జూన్ 6వ తేది ప్రారంభమై జులై 7వ తేదితో ముగుస్తాయి. 18 ఏళ్లు నుంచి 44 ఏళ్లకు వరకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎస్సి,ఎస్టి,బిసి, ఇడబ్ల్యూఎస్ అభ్యర్ధులు వయోపరిమితి 49 ఏళ్ల వరకు, వికలాంగ అభ్యర్ధులకు 54 వరకు అవకాశం ఉంది. జనరల్ అభ్యర్ధులతో పాటు ఎస్సి, బిసి అభ్యర్ధులు కూడా ఫీజు కింద రూ.750లు చెల్లించాలని తెలిపింది. దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు రూ.750లు చొప్పున ఫీజు చెల్లించాలి. డిఎస్సి-2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మరలా దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మే 30వ తేదిన అభ్యర్ధుల హాల్ టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలు ముగిసిన రెండో రోజు ప్రాథమిక ‘కీ’ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుంది. ఈ ‘కీ’పై ఏడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనుంది. అనంతరం వారం రోజుల తర్వాత తుది ‘కీ’ని, మరలా మరో వారం తరువాత తుది ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయనుంది.
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 20- మే 15 : ఆన్‌లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ
- మే 20 నుండి : నమూనా పరీక్షలు
- మే 30 నుండి : హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
- జూన్ 6 నుండి జులై 6 వరకు : పరీక్షలు
ఇవి కీలకం
- అన్ని పరీక్షలు పూర్తయిన రెండవ రోజున ప్రాధమిక కీని విడుదల చేస్తారు
- ఆ తరువాత ఏడు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
- అభ్యంతరాల గడువు ముగిసిన ఏడు రోజుల తరువాత తుది ‘కీ’ విడుదల
- ఆ తరువాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన ుంది.