ఏపీ ఈఏపిసిఈటి-2025, జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్
ప్రజాశక్తి కాకినాడ : ఈనెల 15వ తేదీ శనివారం నుండి ఏపీ ఈఏపీసిఈటి 2025 దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఏపీ ఈఏపిసిఈటి-2025, జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొ. సిఎస్ఆర్ కె ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జెఎన్టియుకె ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపి ఈఏపిసిఈటి) –2025 నోటిఫికేషన్ ను ఈనెల 12వ తేదీ బుధవారం విడుదల చేసినట్లు ఏపి ఈఏపిసిఈటి ఛైర్మన్, జెఎన్ యుకె ఉపకులపతి ప్రొ. సిఎస్ ఆర్ కె. ప్రసాద్ తెలిపారు. ఏపి ఈఏపిసిఈటి-2025 దరఖాస్తులను ఈనెల 15వ తేదీ శనివారం నుండి స్వీకరిస్తున్నామని, ఏప్రియల్ 24వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా ఈఏపి సెట్ పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. మే 19వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఏపి ఈఏపి సెట్ పరీక్షలను ఎటువంటి అవరోధాలకు తావులేకుండా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 46, హైదరాబాద్లోని రెండు సెంటర్లు మొత్తం 48 టెస్ట్ సెంటర్లలో పరీక్షలను నిర్వహిస్తామన్నారు. https://cets.apsche.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో విద్యార్థులు తమ దరఖాస్తులను పూరించాలన్నారు.
మే 19వ తేదీ, మే 20వ తేదీన అగ్రికల్చర్, ఫార్మశీ విభాగాలకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మే 21వ తేదీ నుండి మే 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఏపి ఈఏపి సెట్ కన్వీనర్ ప్రొ.వి.వి.సుబ్బారావు తెలిపారు. మే 25వ తేదీన పరీక్ష ఉండదని, మే 24వ తేదీన ఒక సెషన్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 9గంటల నుండి 12గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.00గంటల నుండి 5.00గంటల వరకు రెండు సెషన్లలోపరీక్షలునిర్వహిస్తామన్నారు.ఏపి ఈఏపి సెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రియల్ 24వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఓపెన్ కేటగిరీ (ఓసి) విద్యార్థులు రూ.600, బిసి విద్యార్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చొప్పున ఆన్లైన్ గేట్వే ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలన్నారు. రూ.1000 అపరాధ రుసుంతో మే 1వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుంతో మే 7వ తేదీ వరకు, రూ. 4వేలు అపరాధ రుసుంతో మే 12వ తేదీ వరకు, రూ. 10వేలు అపరాధ రుసుంతో మే 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. విద్యార్థులు ఎవరైతే ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకుంటారో వారికి కర్నూలు రీజనల్ సెంటర్లో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఏపి ఈఏపి సెట్ దరఖాస్తులో కొత్తగా అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడి ఆప్షన్ ఇవ్వడం జరిగిందని, ఇది ఐచ్ఛికం (ఆప్షనల్) అని, అపార్ ఐడి లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామన్నారు. ఈఏపి సెట్ కౌన్సిలింగ్ సమయానికి తమ ఇంటర్మీడియట్ కళాశాల ద్వారా అపార్ ఐడి పొందాల్సి ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హత ఉన్న విద్యార్థులు తమ దరఖాస్తులను పూరించేటపుడు లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం నెంబర్ ను నమోదు చేయాలన్నారు. అలాగే రిజర్వేషన్ పొందగోరు విద్యార్థులు కుల ధృవీకరణ పత్రం నెంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా తమకు సమీపంలోని ఐదు టెస్ట్ సెంటర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎవరైతే టెస్ట్ సెంటర్స్ ను ప్రాధాన్యతా క్రమంలో ముందుగా ఎంపిక చేసుకుంటారో వారికి మొదటి ప్రాధాన్యతా సెంటర్ ను కేటాయించడం జరుగుతుందన్నారు. ఏపి ఈఏపి సెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈఏపిసెట్ పరీక్షలో 75శాతం వెయిటేజీ, 10+2 పరీక్షల్లోని గ్రూప్ మార్కుల నుండి 25 శాతం వెయిటేజీతో కలిపి ర్యాంకులు కేటాయించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులో ఏదైనా సమాచారాన్ని తప్పుగా పూరించినట్లయితే వారు ఈఏపి సెట్ హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదిస్తే మే 6వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మే 12వ తేదీ నుండి విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. హాల్ టికెట్స్, ర్యాంకు కార్డులను ఏపి ఈఏపి సెట్ వెబ్సైట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. విద్యార్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా https://cets.apsche.ap.gov.in వెబ్సైట్ ద్వారా గాని, 0884-2359599, 0884-2342499ఫోన్ నెంబర్ లలో గాని, [email protected] మెయిల్ ఐడి ద్వారా గాని సంప్రదించవచ్చునని కన్వీనర్ ప్రొ.వి.వి.సుబ్బారావు తెలిపారు.