ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాతావరణ మార్పులు కారణంగా పంట నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా వస్తున్న ఆకాల వర్షాలకు తోడు ఆది, సోమవారాల్లో వచ్చిన వడగాడ్పుల కారణంగా కృష్ణా, ఎన్‌టిఆర్, ఏలూరు జిల్లాల్లో కోతకు వచ్చిన మామిడి పంట నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చేతికొచ్చిన పంట నేల రాలటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఉద్యానశాఖ అధికారులు వెంటనే నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని కోరారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
