స్థలమిచ్చిన రెండేళ్లలో ఇంటి నిర్మాణం

Jan 27,2025 23:44 #ap government, #go, #house
  • ‘అందరికీ ఇళ్లు’ మార్గదర్శకాల విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇళ్ల పట్టాల్లో రెండేళ్లలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని రెవెన్యూశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ‘అందరికీ ఇళ్లు’ పేరుతో ఈ స్థలాలను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జిఓ 23 పేరుతో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా సోమవారం విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు చొప్పున ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్‌) ఉన్న కుటుంబంలోని మహిళల పేరుతో ఈ స్థలాలు కేటాయించనుంది.
పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే ఇళ్లను నిర్మించి టిడ్కో, యుఎల్‌బి ఇతర ఏదైనా ప్రభుత్వ పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తుంది. కేటాయించిన తేదీ నుంచి పదేళ్ల తరువాత లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు, ఇళ్లపై హక్కులు వస్తాయని పేర్కొంది. స్థలం కేటాయించిన రెండేళ్లలోపు అందులో నిర్మాణం చేపట్టాలనే నిబంధన విధించింది. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ఇతర భూములు అందుబాటులో లేనిచోట అసైన్డ్‌ భూములు కేటాయించిన లబ్ధిదారుల నుంచి తిరిగి తీసుకోవాలని ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను విఆర్‌ఒ గానీ, ఆర్‌ఐ గానీ విచారణ జరిపి అర్హులైన వారి పేరుతో డ్రాఫ్ట్‌ జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. గ్రామ, వార్డు సభ నిర్వహించి వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను విడుదల చేయాలి. తహశీల్దారు, మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా తన దగ్గరకు వచ్చిన తుది జాబితాలను జిల్లా కలెక్టర్‌ ఖరారు చేస్తారు. లబ్ధిదారులు నివసించే గ్రామంలో స్థలం అందుబాటులో లేకపోతే పక్క గ్రామంలో కేటాయించాలి.

అర్హతలు ఇవే…

బిపిఎల్‌ కార్డు ఉన్న లబ్ధిదారుల పేరుమీద రాష్ట్రంలో ఎలాంటి ఇళ్లు, ఇంటి స్థలం లేకపోతేనే ఈ పథకానికి అర్హులు. ఐదేకరాల మెట్ట, 2.5 ఎకరాల మాగాణి భూమి ఉన్నవారు అనర్హులుగా పేర్కొంది. రెండు కలిపి ఐదేకరాలు ఉన్నా అనర్హులుగా తెలిపింది. గతంలో ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయి ంచిన స్థలంపై కోర్టు కేసు ఉంటే దానిని రద్దు చేసి కేటాయిస్తామని తెలిపింది. శ్మశానం, గుంతల ప్రాంతాలు, ఇతర గ్రామాల్లో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో నిర్మాణం ప్రారంభించకపోతే వాటిని రద్దు చేసుకుని కొత్త దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించింది.

భూముల గుర్తింపు బాధ్యత కలెక్టర్లదే

గ్రామ, పట్టణాన్ని యూనిట్‌గా తీసుకొని ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పజెప్పింది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలకు కేటాయించిన భూములను తీసుకోవచ్చునని తెలిపింది. ఇండిస్టియల్‌ పార్కుల కోసం ఎపిఐఐసి గుర్తించిన స్థలాలను కూడా పరిశీలించాలని తెలిపింది. ల్యాండ్‌పూలింగ్‌ పథకంలో గుర్తించాలని తెలిపింది. గ్రామకంఠంలో నివసిస్తున్న వారికి సొంత పట్టాలివ్వాలని పేర్కొంది.

కమిటీ ఏర్పాటు

రెవెన్యూశాఖ మంత్రి ఛైర్మన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం నియమించింది. అడిషనల్‌ సిసిఎల్‌ఎ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో మున్సిపల్‌, గృహ నిర్మాణశాఖల మంత్రులు, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ల్యాండ్‌), సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌శాఖ కార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా కమిటీ ఉంటుంది. ఇతర శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు రాష్ట్రస్థాయిలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఒక కమిటీ ఏర్పాటు చేసింది.

➡️