- షెడ్యూల్ విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్, పదోతరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఈ రెండు పరీక్షల టైమ్ టేబుళ్లను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో వేర్వేరుగా బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టడానికి, సరిగ్గా ప్లాన్ చేసుకునేందుకు ఇదే సరైన సమయమని మంత్రి లోకేష్ తెలిపారు. ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. విద్యా ర్థులందరికీ ఈ సందర్భంగా ఆల్‌ది బెస్ట్ తెలిపారు. 2025 మార్చి ఒకటి నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్చి ఒకటి నుంచి 19 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యా ర్థులకు 3 నుంచి 20 వరకు జరుగుతాయి. ఇద్దరికీ కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహిం చనుంది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ విద్యా ర్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలు జరుగుతాయి. వొకేషనల్ విద్యార్థులకు 22వ తేదీ ఉదయం పూట నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమాన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి ఒకటి, పర్యావరణ విద్య పరీక్ష 3న నిర్వహిస్తారు. మార్చి 17 నుంచి 31 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగ నున్నాయి. ఈ పరీక్షలు గతేడాదిలాగే ఏడు పేపర్లలో ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వ హించనుంది. ఇంటర్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది, పదో తరగతి పరీక్షలకు సుమారు ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది.
17 నుంచి టెన్త్