- విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటుపై సిఇఒకు విజ్ఞప్తి
- ఐటి అభివృద్ధిలో సహకారంపై బిల్‌గేట్స్‌తో చర్చలు
- పెట్టుబడిదారులకు సిఎం చంద్రబాబు ఆహ్వానం
- దావోస్‌లో మూడో రోజు ఎనిమిది కంపెనీలతో చర్చలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లయి ఛైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఎపిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా అక్కడ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడోరోజున పలు సంస్థలతో చర్చలు జరిపారు. ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ కూడా వేర్వేరుగా ఆరు సంస్థలతో విస్తృతంగా చర్చలు జరపడంతోపాటు సెమినార్లు, సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించారు. మూడోరోజు గూగుల్ క్లౌడ్ సిఇఒ థామస్ కురియన్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
సర్వర్ల నిర్వహణ విషయంలో ఎపిని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహ కారం ఉంటుందని వివరించారు. ఇటీవల గూగుల్ విశాఖలో తమ డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలి సిందే. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో క్లౌడ్ రీజియన్లు ఉన్నాయి. అనంతరం పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ సిఇఒ మహ్మద్ తౌఫిక్‌తోనూసంప్రదింపులు జరిపారు. మలేషియాకు చెందిన పెట్రోనాస్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మాలిక్యులస్‌కు సంబంధించి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2030 నాటికి ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి కాకినాడ ప్లాంటులో రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మూలపేటలోనూ పెట్టుబడుల అంశాన్ని పరిశీలించాలని తౌఫిక్‌ను చంద్రబాబునాయుడు కోరారు. పెప్సికో ఇంటర్నేషనల్ బేవరేజస్ సిఇఓ యూజీన్ విల్లెంసెన్, ఛైర్మన్ స్టీఫెన్ కెహోతో సిఎం చర్చించారు. విశాఖపట్టణాన్ని గ్లోబల్ డెలివరీగా చేసుకుని పెప్సికో హబ్, గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని వారిని కోరారు. బహ్రెయిన్ ప్రధాని హమద్ ఆల్ మహ్మీద్, ముంతాలకత్ సిఇఓ అబ్దుల్లా బిన్ ఖలీఫా ఆల్ ఖలీఫాతోనూ సమావేశమయ్యారు. ఎపిలో స్మార్ట్ కంటెయినర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని డిజి వరల్డ్ సంస్థ ఆసియా, ఆఫ్రికా ఎమ్‌డి రిజ్వాన్ సూమర్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌పైనా పెట్టుబడులు పెట్టాలని కోరారు.
బిల్‌గేట్స్‌తో చర్చలు
మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటి దిగ్గజం బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాలోకేష్ భేటీ అయ్యారు. ఉమ్మడి సిఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని బిల్‌గేట్స్‌కు వివరించారు. అలాగే ఎపిలోనూ ఐటి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని, ఎఐ యూనివర్శిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరుపున రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. చంద్రబాబును కలవడం ఆనందంగా ఉందని ప్రతిపాదనలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్‌గేట్స్ హామీనిచ్చారు.
ఎపిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ డబ్ల్యుటిసి గ్లోబల్ హెడ్‌ను కోరిన లోకేష్
వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ గ్లోబల్ హెడ్ జాన్ డ్రూతో లోకేష్ చర్చలు జరిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హిటాచీ ఇండియా ఎమ్‌డి భరత్ కౌశల్‌తో చర్చించిన మంత్రి హెచ్‌విడిసి(హైవోల్జేజ్ డైరెక్ట్ కరెంటు) సాంకేతికతకు సహకరించాలని కోరారు. డబ్ల్యుఇఎఫ్ హెల్త్‌కేర్ హెడ్ శ్యామ్ బిషన్, టెమాసెక్ స్ట్రాటజీ హెడ్ రవి లాంబాతో చర్చలు జరిపారు. ఎపిలో మూడు ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతోనూ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విద్యారంగ గవర్నర్లు, డబ్ల్యుఇఎఫ్ సదస్సులోనూ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఎపిలో మూడు నాలెడ్జి సిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎఐపై జరిగిన మరో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లోకేష్ విశాఖపట్నంలో ఎన్విడియా సహకారంతో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కలిసిన ముగ్గురు సిఎంలు
దావోస్‌లో మూడోరోజు చర్చల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకేచోట కలిశారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.