నేడు ఎపి లాసెట్‌-2024 పరీక్ష

Jun 9,2024 10:37 #ap lawset, #Exam
  • ఒక్క నిమిషం ఆలస్యమైనా అనునుమతి ఉండదు

ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) : రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎపి లాసెట్‌, ఎపి పిజి లాసెట్‌-2024 పరీక్షను ఆదివారం నిర్వహించనున్న లాసెట్‌ చైర్మన్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విసి ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వర్సిటీలో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు. పరీక్షలో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లోని లా కళాశాలలు, ప్రయివేటు లా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారని చెప్పారు. మూడు విభాగాల కోర్సులకు 23,425 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో పురుషులు 15,374 కాగా మహిళలు 8,051 ఉన్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల నుండి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ నుండి https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించినట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌తోపాటు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర వాటిల్లో ఏదోఒక గుర్తింపును తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్ష నిర్వహణ కోసం 105 ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2.30 గంటల వరకూ అనుమతిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమావేశలో వర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.కరుణ పాల్గొన్నారు.

➡️