వరద బాధితులకు రూ.120 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో

  • ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్‌)కి పారిశ్రామికవేత్తలు, ఉద్యోగ సంఘాల నాయకులు విరాళాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడలోని కలెక్టరేట్‌లో కలిసి ఈ చెక్కులు, నగదును బుధవారం అందజేశారు. ఎపి ఎన్‌జిఒ ఉద్యోగులు సెప్టెంబరు జీతంలో ఒకరోజు మూల వేతనాన్ని సుమారు రూ.120 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను ముఖ్యమంత్రిని కలిసి ఆయా సంఘాల నాయకులు అందజేశారు. బిఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎమ్‌డి బలుసు శ్రీనివాసరావు, రూ.కోటి, సినీ నిర్మాత అశ్వనీదత్‌ రూ.25 లక్షలు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ రూ.25 లక్షలు, నాగార్జున ఎడ్యుకేషనల్‌ సొసైటీ రూ.25 లక్షలు, కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ రూ.25 లక్షలు, ఎల్‌విఆర్‌ అండ్‌ సన్స్‌ క్లబ్‌ రీడింగ్‌ కమిటీ సభ్యులు రూ.25 లక్షలు, చుక్కపల్లి రమేష్‌ రూ.25 లక్షలు, ఎపి ఫౌల్ట్రీ అసోసియేషన్‌ రూ.25 లక్షలు, ఎంఎస్‌ఎంఇ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన విజయనగరం జిల్లా సమాఖ్య తరపున రూ.10 లక్షలు, గుంటూరు క్లబ్‌ రూ.10 లక్షలు, తెనాలి డబుల్‌ హార్స్‌ రూ.10 లక్షలు, ఐఎఎస్‌ ఆఫీసర్స్‌ వైవ్స్‌ అసోసియేషన్‌ రూ.5 లక్షలు, సిద్ధార్థ వాకర్స్‌ క్లబ్‌ రూ.5 లక్షలు, చిలకమర్రి శ్రీనివాసాచార్యులు రూ.1.50 లక్షలు, టిడిపి మహిళా నాయకులు రాయపాటి శైలజ రూ.5 లక్షలు, ఐ నళినీ ప్రసాద్‌, పొట్లూరి విజరుకుమార్‌, అల్లూరి అచ్యుతరామరాజు, వల్లభనేని రవి రూ.1 లక్ష చొప్పున అందించారు. షేక్‌ బాజీ రూ.50 వేలు, మంత్రి సవిత కుమారుడు తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.21 వేలను ముఖ్యమంత్రిని కలిసి విరాళంగా అందించారు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి ఆహార పంపిణీ, వాటర్‌ బాటిల్స్‌ అందజేశారు. శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల జీతాన్ని ప్రకటించారు. గుంటూరు లోటస్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధులు రూ.10 లక్షలు విరాళాన్ని మంత్రి లోకేష్‌కు అందించారు. వీరితో పాటు ఏలూరుకు చెందిన ప్రవాస భారతీయులు మేకా వినరుబాబు, సామినేని పవన్‌ రూ.10 లక్షలు, మంగళగిరి సిటీ కేబుల్‌ ఎమ్‌డి రూ.5 లక్షలు అందించారు.

పంచాయతీరాజ్‌ జెఎసి రూ.14 కోట్ల విరాళం
పంచాయతీరాజ్‌ జెఎసి ఉద్యోగులు ఒకరోజు బేసిక్‌ వేతనం రూ.14 కోట్లు వరద సహాయ నిధికి అందజేశారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌కు బుధవారం అందించారు. వీరితోపాటు రూరల్‌ వాటర్‌ స్కీం ఉద్యోగులు, ఇంజినీరింగ్‌ ఉద్యోగులు కూడా ఒకరోజు బేసిక్‌ వేతన అంగీకార పత్రాన్ని ఆయనకు అందజేశారు.

➡️