ఎపి పిజి సెట్‌ – 2024 నోటిఫికేషన్‌ విడుదల

  • మే 4 వరకూ దరఖాస్తుల స్వీకరణ
  • జూన్‌ 10 నుంచి పరీక్షలు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పిజి కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఎపి పిజి సెట్‌ – 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. మే నాలుగు వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం సెట్‌ చైర్మన్‌, ఎయు విసి ఆచార్య పివిజిడి.ప్రసాద్‌రెడ్డితో కలిసి విశాఖలో విడుదల చేశారు. ఈ సందర్భంగా శశిభూషణరావు మాట్లాడుతూ.. ఒసి అభ్యర్థులు రూ.850, బిసి అభ్యర్థులు రూ.750, ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగ విద్యార్థులు రూ.650 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని తెలిపారు. మే ఐదు నుంచి 15 వరకు రూ.500 అపరాధ రుసుముతో, మే 16 నుంచి మే 25 వరకు వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు చెప్పారు. తమ దరఖాస్తులలో దొర్లిన తప్పులను మే 27 నుంచి 29 వరకు అభ్యర్థులు సరిచేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మే 31 నుంచి అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 10 నుంచి 14 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఎపి పిజి సెట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎయు ఇంజనీరింగ్‌ కళాశాల ఒఎస్‌డి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

➡️