రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమచేయాలి : ఎపి రైతు సంఘం

May 16,2024 21:21 #AP Rythu Sangam, #Input Subsidy

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లో కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్‌లో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్లో తుపానులో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇంతవరకు రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో రైతుల ఆందోళన ఫలితంగా కరువు మండలాలుగా ప్రకటించినా ఏ మాత్రమూ కరువు సహాయ చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఒక్కపైసా నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమకాలేదని వివరించారు. ఎన్నికల ముందు లబ్ధి పొందేందుకు కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని హడావుడి చేసి ఇన్‌పుట్‌ సబ్సిడీ వేస్తామని తెలిపారని, ఇసి అంగీకరించకపోవడంతో రైతుల ఖాతాల్లో జమకాలేదని వివరించారు. వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ జమచేయాలని కోరారు.

➡️