మార్గదర్శకాలు తూచ తప్పక పాటించాలి

  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలను తూచ తప్పక పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ, లోక్‌సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గ ఎఆర్‌ఒల తొలివిడత శిక్షణ కార్యక్రమం సోమవారం విశాఖలోని ఎయు కెమికల్‌ ఇంజనీరింగ్‌ బ్లాక్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, అందుకోసమే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఇవిఎంలు, ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారులు ప్రధానమని, ఆ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆర్‌ఒలతోపాటు ఎఆర్‌ఒలు కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలి విడత శిక్షణను సోమవారం విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో ప్రారంభించామని, ఈ నెలాఖరులోగా మిగిలిన శిక్షణ కార్యక్రమాలు పూర్తి కానున్నాయని వివరించారు. శిక్షణ కోసం జాతీయ స్థాయి మాస్టర్‌ ట్రైనీలు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జాతీయ మాస్టర్‌ ట్రైనీ సమీర్‌ అహ్మద్‌ జాన్‌, డిఆర్‌ఒ కె.మోహన్‌కుమార్‌, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.

➡️