- ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్
- ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం, సెకెండ్ ఇయర్‌లో 83 శాతం ఉత్తీర్ణత
- ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు మెరుగు
- ప్రథమ స్థానం సాధించిన కృష్ణా జిల్లా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బాలికలు హవా సాగించారు. ఈ మేరకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,87,295 మంది విద్యార్థులు పరీక్ష లు రాయగా, 3,42,979 మంది (70 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 4,22,030 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,51,521 మంది (83 శాతం) ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో 38,553 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 23,991 మంది (62 శాతం) ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరంలో 33,289 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 25,707 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
బాలికలదే పైచేయి
ఇంటర్ పరీక్షల్లో బాలురు కంటే బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. జనరల్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో 2,38,107 మంది బాలురు పరీక్ష రాస్తే 1,56,258 మంది (66 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 2,49,188 మంది బాలికలు పరీక్ష రాయగా, 1,86,721 మంది (75 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 2,03,904 మంది బాలురు పరీక్షలు రాస్తే 1,62,952 మంది (80 శాతం) ఉత్తీర్ణులవగా, 2,18,126 మంది బాలికలు పరీక్ష రాయగా 1,88,569 మంది (86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో 15,968 మంది బాలురు పరీక్షలు రాస్తే 7,966 మంది (50 శాతం) ఉత్తీర్ణులవగా, 22,585 మంది బాలికలు పరీక్ష రాయగా 16,025 మంది (71 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 13,710 మంది బాలురు పరీక్ష రాస్తే 9,236 మంది (67 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 19,579 మంది బాలికలు పరీక్షలు రాయగా 16,471 మంది (84 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం 50,314 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 23,799 మంది (47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గడిచిన పదేళ్లలో రెండో అత్యధిక శాతంగా ఉంది. రెండో సంవత్సరం 39,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 27,276 మంది (69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక ఉత్తీర్ణతగా నమోదైంది. 2,257 ప్రైవేటు కళాశాలల నుంచి 3,85,501 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తే 74 మంది ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం పరీక్షల్లో 3,42,781 మంది పరీక్షలు రాస్తే 85 శాతం ఉత్తీర్ణులయ్యారు. హైస్కూల్ ప్లస్‌లో మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం బాగా తక్కువగా నమోదైంది. మొదటి సంవత్సరంలో 34 శాతం, రెండో సంవత్సరం పరీక్షల్లో కేవలం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎపి సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మొదటి సంవత్సరంలో 86 శాతం, రెండో సంవత్సరంలో 94 శాతం ఉత్తీర్ణత సాధించగా, కెజిబివిల్లో మొదటి సంవత్సరంలో 69 శాతం, రెండో సంవత్సరంలో 84 శాతం ఉత్తీర్ణత సాధించారు. గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 80 శాతం, రెండో సంవత్సరంలో 91 శాతంగా, బిసి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 92 శాతం, రెండో సంవత్సరంలో 97 శాతం ఫలితాలు సాధించారు. ఎపి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 90 శాతం, రెండో సంవత్సరంలో 96 శాతం ఫలితాలు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం
ఇంటర్ ఫలితాలను జిల్లాల వారీ పరిశీలిస్తే మొదటి, రెండో సంవత్సరాల ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 23,219 పరీక్ష రాయగా, 19,743 మంది ఉత్తీర్ణలవడంతో 85 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, గుంటూరు జిల్లా 32,613 మంది పరీక్షలు రాస్తే 26,872 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 82 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లాలో 13,183 మంది పరీక్షలు రాయగా, 7,168 మంది (54 శాతం) ఉత్తీర్ణులవడంతో చివరి స్థానంలో నిలిచింది. రెండో సంవత్సరంలో కృష్ణా జిల్లాలో 19,133 మంది పరీక్షలు రాస్తే, 17,708 మంది ఉత్తీర్ణులు కావడంతో 93 శాతం ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లాలో 28,231 మంది పరీక్షలు రాస్తే 25,646 మంది ఉత్తీర్ణులవడంతో 91 శాతం ఫలితాలు సాధించి ద్వితీయ స్థానంలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5,190 మంది పరీక్షలు రాస్తే 3,786 ఉత్తీర్ణులవడంతో 73 శాతం ఫలితాలు సాధించి చివరి స్థానానికి పరిమితమైంది.
విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. తొలిసారి వాట్సాప్ ద్వారా ఫలితాలు విద్యార్థులకు అందించే ఏర్పాట్లను ఇంటర్మీడియట్ బోర్డు చేసింది. వాట్సాప్‌లో 9552300009 నెంబర్‌కు హారు అని సందేశం పంపి, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చునని తెలిపారు.