ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు డిసెంబర్ చివరి వరకు గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, అధికారులకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఒక లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మామిడి, జీడిమామిడి ఇతర పంటలకు, రాష్ట్రవ్యాప్తంగా రబీ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు రైతులకు డిసెంబర్ 15వ తేదీ వరకు గడువుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గడువు ముగుస్తుందనే సమాచారం రైతులందరికీ చేర్చలేదని, దీంతో చాలా మంది చెల్లించలేకపోయారని పేర్కొన్నారు. సమాచారం ఉన్నా ఆన్‌లైన్‌లో వచ్చిన సమస్యల వల్ల చెల్లించేందుకు కొంతమందికి ఆటంకాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ పంటల బీమా ప్రీమియం చెల్లించే గడువును డిసెంబర్ చివరి వరకు పొడిగించాలని కోరారు. పంటల బీమా ప్రయోజనం రైతులకు విస్తృతంగా కలగాలంటే గడువు పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
