ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మద్యం షాపులకు విదేశాల నుండి కూడా దరఖాస్తులు అందుతున్నాయి. అమెరికాతో పాటు పలు యూరప్ దేశాల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం గురువారం సాయంత్రానికి ఒక్క అమెరికా నుండే 20 దరఖాస్తులు దాఖలయ్యాయి. పలు యూరప్ దేశాల నుండి కూడా మద్యం షాపుల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో కొందరు తమ బంధువుల తరపున దరఖాస్తులు పెడుతుండగా, మరికొందరు నేరుగా తమ పేరుమీదనే దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశాల్లో ఉన్న వారు కూడా స్పందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
షెడ్యులు ప్రకారం దరఖాస్తుల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. గురువారం రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 65,424 దరఖాస్తులు అందాయి. డిపాజిట్ల ద్వారానే రూ.2వేల కోట్లు ఆదాయం గడించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1,308 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి అందింది. దీంతో దరఖాస్తులకు మరింత గడువు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం.