- విశాఖ మొదటి దశకు రూ.11,498 కోట్లు
- విజయవాడ మొదటి దశకు రూ.11,009 కోట్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టులకు సంబంధించి తొలిదశ డిపిఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో తొలిదశలో 46.23 కిలోమీటర్లు మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. ఇందుకు రూ.11,498 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొదటి కారిడార్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.40 కిలోమీటర్లు, రెండవ కారిడార్‌లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీసుకు 5.08 కిలోమీటర్లు, మూడవ కారిడార్‌లో తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్‌కు 6.75 కిలోమీటరు మేర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు డిపిఆర్‌లో ప్రతిపాదించారు. రెండవ దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకూ 30.67 కిలోమేటర్ల మేర మెట్రోరైల్ ప్రాజెక్టును నిర్మించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. విజయవాడలో మెట్రోరైల్ రెండు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో భాగంగా కారిడార్ 1(ఎ) గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1(బి) పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. రెండు కారిడార్‌లు కలిపి 38.40 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు. ఇందుకు రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన భూసేకరణకు రూ.1,152 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. రెండవ దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ 27.75 కిలోమీటర్ల మేర మూడవ కారిడార్‌లో భాగంగా నిర్మాణం చేపట్టనున్నట్లు డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి కన్నబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైల్ డిపిఆర్‌ను కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.