- సిఆర్‌డిఎ అథారిటీ సమావేశంలో నిర్ణయం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని పరిధిలో రూ.37,702 కోట్ల విలువైన నిర్మాణ పనులకు సిఆర్‌డిఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అధారిటీ 45వ సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. ప్రస్తుతం అమోదం పొందిన పనులకు 17వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో అనుమతి పొందుతామని, అనంతరం ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే నెలలో సుమారు 20 వేలమంది పనుల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో దాదాపు రూ.48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. వీటిల్లో రూ.37,702 కోట్ల విలువైన పనులకు సంబంధించి 59 టెండర్లను సోమవారం తెరచినట్లు తెలిపారు. వీటిల్లో సిఆర్‌డిఏకు చెందిన 22 పనుల విలువ రూ.22,607 కోట్లని, ఎడిసికి సంబంధించిన 37 పనుల విలువ రూ.15,095 కోట్లని తెలిపారు. సిఆర్‌డిఏ ఆధ్వర్యాన చేయాల్సిన పనులు 24 ఉన్నాయని, ప్రస్తుతానికి 22 మాత్రమే చేస్తున్నామని వివరించారు. మిగిలిన రెండు పనులకు ఈ నెల 17న టెండర్లు ఓపెన్ చేస్తామని వివరించారు. అలాగే ఎన్‌టిఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, జాతీయ రహదారికి ఇంటర్‌నల్ రోడ్ల అనుసంధానం, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబంధించి రూ.16,781 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలుస్తామని చెప్పారు. అమరావతి అభివృద్ధికి 2014-19 మధ్యకాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే రూ.9 వేల కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో పలు సంస్థలకు భూములు కేటాయించామని, ఈ అంశంపై మంత్రుల బృంద సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 31 సంస్థలకు కేటాయించిన భూములకు అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. రెండు సంస్థలకు స్థలం మార్పునకు, మరో 11 సంస్థలకు స్థలం మార్పుతోపాటు కాల పరిధిని కూడా పొడిగించినట్లు పేర్కొన్నారు.
పన్నులతో రాజధాని కట్టం
అమరావతి అభివృద్ధికి దాదాపు రూ.64 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల నుండి ఏమాత్రమూ దీనికోసం ఖర్చు పెట్టేది లేదని మంత్రి తెలిపారు. . రైతుల నుండి సేకరించిన భూముల్లో 6203 ఎకరాలు సిఆర్‌డిఏకు మిగిలిందని, అందులో 1900 ఎకరాలు పలు సంస్థలకు కేటాయించామని పేర్కొన్నారు. అన్నీపోగా సిఆర్‌డిఏ వద్ద అభివృద్ధి చేసిన స్థలం 4000 ఎకరాలు ఉంటుందన్నారు. ఈ భూమి తనఖా పెట్టడం, వేలం వేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో క్యాపిటల్ సిటీని నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, ప్రపంచబ్యాంకు నుండి రూ.15 వేల కోట్లు, వివిధ బ్యాంకు ద్వారా రూ.5 వేల కోట్లు సమీకరించినట్లు తెలిపారు. వాటితో పనులు ప్రారంభిస్తున్నామని, అభివృద్ధి పనుల వల్ల భూమిరేట్లు కూడా పెరుగుతాయని, అప్పుడు అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో అసలు, వడ్డీలు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని రకాల భూములు కలుపుకుని 53,500 ఎకరాలు ఉందని, అందులో 30 శాతం వరకూ గ్రీన్ అండ్ బ్లూ ఏరియాని అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.