APPSC GROUP 1 -ఐఫోన్‌తో ప్రశ్నాపత్రం స్కాన్‌ – పట్టుబడ్డ సిఐ కుమారుడు

ఒంగోలు (ప్రకాశం) : సిఐ కుమారుడు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కాపీయింగ్‌కు యత్నిస్తూ పట్టుబడిన ఘటన ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది.

ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చినమల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన కుమారుడు శివశంకర్‌ నిన్న నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష రాయడానికి ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రానికి వచ్చాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత అతడు తన వద్దనున్న ఐఫోన్‌తో ప్రశ్నపత్రాలను స్కాన్‌ చేసి బయటకు పంపుతున్నట్లు తోటి అభ్యర్థులు గుర్తించి వెంటనే ఈ విషయాన్ని అదే కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ ఎస్సై తనిఖీ అధికారులకు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న సంయుక్త కలెక్టర్‌ గోపాలకఅష్ణ.. నిందితుడు శివశంకర్‌ను పరీక్షా కేంద్రం నుంచి బయటికి పంపి పోలీసులకు అప్పగించారు. అతడి నుంచి ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. పాస్‌వర్డ్‌ చెప్పేందుకు నిందితుడు నిరాకరించాడు. దీంతో జిల్లా పోలీసు కేంద్రం నుంచి ఐటీ కోర్‌ బఅందాన్ని పిలిపించి ఫోన్‌లోని సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు విఫలయత్నం చేసినట్లు తెలిసింది. శివశంకర్‌పై మాల్‌ ప్రాక్టీస్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ ఎం.కిషోర్‌బాబు వివరించారు.

తనిఖీలు చేసినా సెల్‌ఫోన్‌తో ఎలా వెళ్లగలిగాడు..! పలు విమర్శలు..
పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థి సెల్‌ఫోన్‌తో ప్రవేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు కేంద్రం వద్ద మెటల్‌ డిటెక్టర్‌తో పకడ్బందీగా తనిఖీలు చేశామని అధికారులు ప్రకటించినప్పటికీ…. ఫోన్‌తో అతడు ఎలా లోపలికి వెళ్లాడనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఉదయం 11.30 గంటల సమయంలోనే ఈ విషయం వెలుగుచూసినా … పోలీసులు సాయంత్రం వరకు నిందితుడి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టకపోవడంపై పలు విమర్శలస్తున్నాయి. ప్రశ్నపత్రాలను స్కాన్‌ చేసిన శివశంకర్‌ వాటిని ఎవరికి పంపారు ? సమాధానాలు రాసేందుకు ఎవరి సహకారం తీసుకున్నారు ? కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఈ పనిచేశాడా ? దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

➡️