ఎపిఆర్‌జెసి ఫలితాలు విడుదల

May 14,2024 23:46 #aprjc, #Result Released

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి 2024-25 సంవత్సరపు ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ కార్యాలయంలో ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాకమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌, ఎపి గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ నరసింహారావు, సంయుక్త కార్యదర్శి హెచ్‌ఎమ్‌డి ఉబేదుల్లా, లైజన్‌ అధికారి పివి మల్లేశ్వర్‌ విడుదల చేశారు. ఎపి గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యాన ఏప్రిల్‌ 25న నిర్వహించిన ప్రవేశ పరీక్షల ద్వారా 38 సాధారణ గురుకుల పాఠశాలలో 5వ తరగతికి, 12 మైనార్టీ పాఠశాలల్లో గల సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే 6, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు కూడా ప్రవేశాలను నిర్వహిస్తున్నామని అన్నారు. 5వ తరగతిలో 3,195 సీట్లకు 17,312 మంది విద్యార్థులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారని తెలిపారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కీర్తికి అత్యధికంగా 99 మార్కులు వచ్చినట్లు పేర్కొన్నారు.
అలాగే 6వ తరగతిలో 257 సీట్లకు 3,969 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే విజయనగరం జిల్లాకు చెందిన సి సోమేశ్వరరావుకు అత్యధికంగా 87 మార్కులు వచ్చాయన్నారు. 7వ తరగతికి 146 సీట్లకు 1,750 మంది పరీక్షలు రాస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె ఖగేంద్రకు 88 మార్కులు వచ్చాయని తెలిపారు. 8వ తరగతికి 172 సీట్లకుగానూ 2,185 మంది పరీక్షలు రాస్తే విజయనగరం జిల్లాకు చెందిన వై మేఘాశ్యామ్‌కు 83 మార్కులు అత్యధికంగా వచ్చాయన్నారు. అలాగే 7 సాధారణ జూనియర్‌ కాలేజీలు, మూడు మైనార్టీ కాలేజీల్లో 474 ఎపిసి, ఇఇటి గ్రూప్‌లకు గానూ 35,872 మంది పరీక్షలు రాస్తే తూర్పుగోదావరికి చెందిన జి యశ్వంత్‌సాయికి 142 మార్కులు వచ్చాయన్నారు. 334 బైపిసి, సిజిటి సీట్లకుగానూ 11,031 మంది పరీక్షలు రాశారని, ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్‌ మహితకు 137 మార్కులు వచ్చాయన్నారు. ఎమ్‌ఇసి, సిఇసిలో 341 సీట్లకు 2,405 మంది పరీక్షలు రాస్తే తూర్పుగోదావరికి చెందిన సత్యరామ్‌మోహన్‌కు 140 మార్కులు వచ్చాయన్నారు. అలాగే నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కాలేజీలోని 40 బిఎ డిగ్రీ సీట్లకు గానూ 150 మంది పరీక్షలు రాస్తే ఏలూరు జిల్లాకు చెందిన ఎం రవీంద్ర వరప్రసాద్‌కు 113 మార్కులు వచ్చాయన్నారు. అలాగే 40 బికామ్‌ సీట్లకు 394 మంది పరీక్షలకు హాజరైతే అన్నమయ్య జిల్లాకు చెందిన టి గణేష్‌కు 112 మార్కులు వచ్చాయన్నారు. 36 బిఎస్‌సి (ఎంపిసి) సీట్లకు 312 మంది పరీక్ష రాస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి సాయికృపారెడ్డికి 118 మార్కులు వచ్చాయన్నారు. అలాగే బిఎస్‌సి (ఎమ్‌ఎస్‌సిఎస్‌)లో 36 సీట్లకు 107 మంది పరీక్షలు రాస్తే కడప జిల్లాకు చెందిన బి రాజశేఖర్‌కు 103 మార్కులు అత్యధికంగా వచ్చాయన్నారు. ఈ విద్యాసంస్థల్లో ఎంపిక జాబితాను, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చామని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 15వ తేదీలోపు ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా సమాచారాన్ని అందిస్తామన్నారు.

➡️