- సాధారణ ఛార్జీలతోనే ప్రయాణం
- ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 7,200 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక బస్సులైనప్పటికీ అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలతోనే ప్రయాణం చేయొచ్చని, రానూపోనూ టిక్కెట్ ఒకేసారి బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తారని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులు ఈ నెల 8 నుంచి 13 వరకు, 16 నుంచి 20వ తేదీ వరకు నడిపేందుకు ఆర్‌టిసి సిద్ధమైందన్నారు. ఇప్పటికే ఈ నెల 10 నుంచి 12 వరకూ అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అయ్యాయన్నారు. ప్రత్యేక సర్వీసుల పర్యవేక్షణకు జిల్లా ముఖ్య కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోని పలు పాయింట్ల వద్ద అధికారులు, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. బస్సుల సమాచారం కోసం కాల్ సెంటర్ నెంబరు 149 లేదా 0866-2570005 నెంబరు 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. సంక్రాంతికి ముందు రోజు వరకు తిరిగే బస్సులకు అదనంగా 3,900 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అందులో హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42, విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 250, రాజమండ్రి నుంచి 230, తిరుపతి నుంచి 50, ఇతర ప్రాంతాల నుంచి 500 బస్సులు రాష్ట్రంలోని పలు పట్టణాలకు నడుస్తాయన్నారు. తిరుగు ప్రయాణం కోసం 3,300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.