ఆక్వాకు రిలీఫ్‌ ప్యాకేజీ ప్రకటించాలి

  • సిఎం చెప్పినా అమలు కాని వంద కౌంట్‌ ధర రూ.220
  • పి-4, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏమయ్యాయి?
  • ఫీడ్‌, సీడ్‌ ధరలు తగ్గించి ఆదుకోవాలి
  • ఆక్వా రైతుల సదస్సులో వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- భీమవరం : సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రిలీఫ్‌ ప్యాకేజీని తక్షణం ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ టారిఫ్‌లతో పది రోజుల నుంచి ఆక్వా రైతులకు కంటి మీద కునుకులేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. సుంకాలపై అమెరికా 90 రోజులు మినహాయింపు ఇచ్చినా సిండికేట్‌ మాయాజాలం పాత ధరకే రొయ్యలను కొనుగోలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వంద కౌంట్‌ కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.260 ఖర్చవుతోందని, గిట్టుబాటు ధర కల్పించడం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు కిలో రూ.220కు కొనుగోలు చేయాలని ఎగుమతిదారులకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఈ ధర కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో సిపిఎం ఆధ్వర్యాన ఆక్వా రైతుల సదస్సు ,మంగళవారం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్వా సలహా మండలి జూమ్‌ సమావేశం సోమవారం జరిగిందని, ప్రభుత్వ పెద్దలు, ఎంఎల్‌ఎలు, మంత్రులు, ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు అంతా తిట్టుకుని సమావేశం అర్ధాంతరంగా ముగించేశారని తెలిపారు. కనీసం ఆక్వా రంగ సమస్యలపై ఉమ్మడిగా ఆలోచన చేయలేదన్నారు. ఆక్వా రంగ సమస్య అంతర్జాతీయ సమస్య అని తెలిపారు. అమెరికా వాణిజ్య యుద్ధం చేస్తోంద న్నారు. ఆక్వా ఉత్పత్తులపై 26 శాతం సుంకాన్ని విధిస్తే కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తోందని నిలదీశారు. దేశభక్తుడనని చెప్పుకునే ప్రధాని మంత్రి మోడీకి మన దేశ ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నించారు. మోడీ, ట్రంప్‌ స్నేహితులని, అయితే రాయబారానికో, కాళ్ల బేరానికో వెళ్తే సమస్య పరిష్కారం కాదని తెలిపారు. ఇతర దేశాలను కలుపుకొని ట్రంప్‌ చర్యలను వ్యతిరేకించాలన్నారు. ఏడు శాతం ఉన్న సుంకాన్ని 26 శాతానికి పెంచడం వల్ల రొయ్యల రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని, నూటికి 60 శాతం మంది ఉన్న పేద రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. పది శాతం మంది ఉన్న బడా రైతులు ఆక్వా రంగంలో రాజ్యమేలుతున్నారని, సిండికేట్‌గా ఏర్పడి ఫీడ్‌, సీడు, ఎగుమతులు అన్ని వారి ఆధీనంలోనే నిర్వహిస్తున్నారని, అనేక దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారని,వాళ్లే నేడు రాజకీయాలను శాసిస్తున్నారని వివరించారు.

ఆక్వా రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలి

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆక్వా రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఆక్వా రంగంపై భారాలు తగ్గించాల్సి ఉండగా, మరిన్ని భారాన్ని మోపడం అన్యాయమన్నారు. యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తామని చెప్పి అమలు చేయకపోగా రూ.3.80కు ఇస్తున్నారని, దీనికి అదనంగా వివిధ రకాల ఛార్జీలు కలిపి రెట్టింపు ధరకు విద్యుత్‌ను అందించడం దారుణమని తెలిపారు. ఫీడ్‌, సీడ్‌, విద్యుత్‌ ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందన్నారు. అయినా, వీటి ధరలు ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేష్‌ చెబుతున్నారని, ఆక్వా రైతులు పది రోజుల నుంచి కష్టనష్టాలు మధ్య కొట్టుమిట్టాడుతుంటే మీ డూయింగ్‌లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. సంపన్నులు పేదలను ఆదుకుంటారని పి-4 పేరిట హడావుడి చేస్తున్నారని, మరి సంపన్నులైన వ్యాపారులు పేద రైతుల నుండి కనీసం ప్రభుత్వం నిర్ణయించిన ధరకైనా ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలను రాజకీయం చేయబోమని, అయితే, ఆక్వా రైతులకు అండగా ఉండి వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని తెలిపారు. అన్ని సంఘాలనూ కలుపుకొని పార్టీలకతీతంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అవసరమైతే ఉమ్మడి కార్యాచరణ రూపొందించి సిపిఎం ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ. ఏటా రూ.60 వేల కోట్లు ఆక్వాపై వ్యాపారం జరుగుతున్నా ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నాయన్నారు. ఒకప్పుడు ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా ఇప్పుడు ఆక్వా కేంద్రంగా ఉందని, దీనిని ప్రభుత్వం గుర్తించడం లేదని, తగిన సహకారం అందించడం లేదని తెలిపారు. రైతు సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం పూర్వ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లో ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తుంటే టిడిపి కూటమి ప్రభుత్వం మాత్రం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. ఆక్వా రైతులను ఆదుకోవాలని, పెంచిన సుంకాలు తగ్గించాలని కోరుతూ మావుళ్లమ్మ గుడికి వెళ్లే రహదారిలో రైతులు, సిపిఎం నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సదస్సులో ఆక్వా రైతు నాయకులు బొల్లెంపల్లి శ్రీనివాసరావు, నక్క శ్రీనివాస్‌. ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ నాయకులు షేక్‌ అలీ హుస్సేన్‌, రైతు కార్యాచరణ నాయకులు కృష్ణారావు, బర్రె ముసలయ్య, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.

ఐదు డిమాండ్లతో తీర్మానం ఆమోదం
-16 మంది సభ్యులతో ఆక్వా పరిరక్షణ కమిటీ ఎన్నిక

ఆక్వా రైతుల సదస్సు ఐదు డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఆమోదించింది. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ట్రంప్‌ సుంకాలు విరమించేందుకు చర్యలు చేపట్టాలని, వంద కౌంట్‌కు రూ.270 గిట్టుబాటు ధర కల్పించాలని, ఫీడ్‌ ధర టన్నుకు రూ.30 వేలు తగ్గించాలని, ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సదస్సులో తీర్మానించారు. 16 మంది సభ్యులతో ఆక్వా పరిరక్షణ కమిటీని ఎన్నుకున్నారు.

➡️