- చలి ఉత్సవ్ ముగింపులో టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్
ప్రజాశక్తి- అరకులోయ (అల్లూరి జిల్లా) : టూరిజం కేంద్రంగా అరుకును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. అరకులోయలో జనవరి 31వ తేదీన ప్రారంభమైన అరకు చలి ఉత్సవ్ ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అజయ్ జైన్ మాట్లాడుతూ.. టూరిజం అభివృద్ధికి అరకు అనువైన ప్రదేశమన్నారు. టూరిజం అభివృద్ధిపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారని తెలిపారు. ప్రతి జిల్లాలో ఉత్సవాలు నిర్వహించడానికి కేలండర్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ.. అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా అరకును అభివృద్ధి చేస్తామని చెప్పారు. మాడగడ కేంద్రంలో పారాగ్లైడింగ్‌కు అనువైన ప్రదేశం ఉందన్నారు. ఉత్సవంలో మణిపూర్, నాగాలాండ్ మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారులు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అద్భుతంగా ప్రదర్శనలిచ్చారని తెలిపారు. ఉత్సవ్‌లో భాగంగా మూడవ రోజైన ఆదివారం ఉదయం సుంకరమెట్ట కాఫీ ట్రయల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ట్రక్కింగ్ చేపట్టారు.