విచారణకు ఒక రోజు ముందు..ప్రజారోగ్య బిల్లుపై ఆరిఫ్‌ ఖాన్‌ సంతకం

  • రాష్ట్రపతి ఆమోదానికి మరో 7 బిల్లులు

తిరువనంతపురం : తనపై సుప్రీంకోర్టులో విచారణకు ఒక రోజు ముందు ప్రజారోగ్య బిల్లుపై కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ సంతకం చేశారు. మరో ఏడు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. లోకాయుక్త చట్టం సవరణ, యూనివర్సిటీ చట్టం సవరణ, సహకార చట్టం సవరణ వంటి బిల్లులను రాష్ట్రపతికి పంపారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలుపుదల చేయడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల విమర్శించింది. పంజాబ్‌ గవర్నర్‌ను విమర్శిస్తూ ఇచ్చిన తీర్పును కేరళ గవర్నర్‌ చదివితే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే తమ వద్ద నిలిపివుంచిన ఎనిమిది బిల్లుల్లో ఏడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలని గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. లోకాయుక్త సవరణ బిల్లు, గవర్నర్‌ను ఛాన్సలర్‌ పదవి నుంచి తొలగించేందుకు యూనివర్సిటీల చట్టంలో రెండు సవరణలు, వైస్‌ఛాన్సలర్‌ నియామకానికి సంబంధించిన సెర్చ్‌ కమిటీ బిల్లు, యూనివర్సిటీ అప్పీలేట్‌ అథారిటీ బిల్లు, సహకార చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతికి పంపారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని రాజ్‌ భవన్‌ నిర్ణయించింది. కేరళ ప్రజారోగ్య బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ప్రజారోగ్య బిల్లును ఈ ఏడాది మార్చిలో విజయన్‌ ఆమోదించి, ఏప్రిల్‌లో గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు.

➡️