ప్రధాని రాకతో ఏర్పాట్లు కట్టుదిట్టం

Jun 11,2024 21:02 #arrangements, #Arrival, #prime minister

– ఎస్‌పిజి ఐజి నవనీత్‌ కుమార్‌ మెహతా
ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా జిల్లా) :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం పర్యటన నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎస్‌పిజి ఐజి నవనీత్‌ కుమార్‌ మెహతా సూచించారు. గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామంలోని ఐటి పార్కు మేధా టవర్స్‌ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గనేందుకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు భద్రత సమన్వయం (ఎఎస్‌ఎల్‌) నిర్వహించారు. ప్రత్యేక అధికారులు హరికిరణ్‌, డిఐజి గోపీనాథ్‌ జెట్టి, జిల్లా పోలీస్‌ అధికారి అద్నాన్‌ నయీమ్‌ అస్మి ఇతర పోలీసు అధికారులతో కలిసి ప్రధానమంత్రి కాన్వారు రాకపోకలపై రూట్‌ మ్యాప్‌పై చర్చించారు. ఆ మార్గంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రమాణ స్వీకార వేదిక వరకు ట్రయల్‌ రన్‌ కాన్వారును పరీక్షించారు. అదనపు ఎస్‌పి జి వెంకటేశ్వరరావు, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు, డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

➡️