ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : చిత్తూరు అంబేద్కర్ భవన్‌లో 218 మంది వికలాంగులకు కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. ఫ్రీడం ట్రస్ట్, సేవ్ ఎక్స్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.35 లక్షలతో వీటిని అందించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ మాట్లాడుతూ.. వికలాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థలను అభినందించారు. కృతిమ కాళ్లతో పాటు ట్రై సైకిళ్లను అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ..అంగవైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని, వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఎడి శ్రీనివాస్, ఫ్రీడమ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ సుదర్శన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్‌రెడ్డి, అధికారులు పాల్గన్నారు.
