ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జూన్ నెలాఖరులోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో 18.04 లక్షల ఇళ్లు మంజూరైతే 5.87 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేసిందని, 12.20 లక్షల ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందని పేర్కొన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షల్లో కేవలం రూ.30 వేలు మాత్రమే గత ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించిందన్నారు. ఎస్సి, బిసి లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టిలకు రూ.75 వేలు, పివిటిజిలకు 1 లక్ష అదనపు ఆర్ధిక సాయం అందించేందుకు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. పిఎం జన్‌మాన్, పిఎంఏవై అర్భన్, పిఎంఏవై రూరల్ పథకాల కింద 5,98,710 మందికి ఈ అదనపు సాయం వర్తిస్తుందన్నారు.
