- వైసిపి డుమ్మా
- ‘కూటమి’ పార్టీలే హాజరు
- సమావేశాల స్థాయిని తగ్గిస్తున్న నేతలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణకు అధికారయంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయితే, కీలకమైన ప్రజా సమస్యలు ఏ మేరకు చర్చకు వస్తాయన్నదే అనుమానాస్పదంగా మారింది. శాసనసభలోని ఏకైక ప్రతిపక్షం వైసిపి సమావేశాలకు హాజరుకావడం లేదని ప్రకటించడమే దీనికి కారణం. వైసిపిని మినహాయిస్తే శాసనసభలో టిడిపి కూటమి పార్టీలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉన్న ఒక్క ప్రతిపక్షమూ సభకి దూరమైతే అధికారంలో ఉన్న టిడిపి కూటమి పార్టీల సమావేశాలుగా మాత్రమే అసెంబ్లీ మారనుంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి తన నివాసం నుండే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ప్రకటించారు. తనకు ఎక్కువ సమయం మైక్ ఇయ్యవలసి వస్తుందనే ప్రతిపక్షహోదా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. వైసిపి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూటమి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే, ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయాలు చేయాల్సిన అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం దూరంగా ఉండటం ఇదే మొదటి సారి కాదు. రాష్ట్ర విభజన జరిగినతరువాత ఏర్పడిన ప్రతి శాసనసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి సమావేశాలను బహిష్కరించారు. 2019లో వైసిపి అధికారంలోకి రాగానే ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును అవమానాల పాలు చేయడంతో ఆయన మాత్రమే సమావేశాలకు రానని చెప్పి వెళ్లిపోయారు. మిగిలిన సభ్యులు హాజరయ్యారు. ఇప్పుడు వైసిపి వంతు రావడంతో, సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల తీరుతో సమావేశాల స్థాయి కూడా దిగజారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. . ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్ష పార్టీలపై ఏకపక్షంగా విరుచుకుపడటం, హేళన చేయడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆనవాయితీగా మారు తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. . కొత్త సభ్యులు సభలో వాడకూడని పదాలు వాడుతున్నా నియంత్రణ కూడా ఉండటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చలు జరగడం లేదు. వ్యక్తిగత దూషణలు, విమర్శలకే సమావేశాలు పరిమితమవుతున్నాయి. చట్టసభలో ఉంటే అడిగిన ప్రశ్నలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు అధికారికంగా రికార్డు అవుతాయన్న సంగతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలియనిదేం కాదు. అయినా, ఆయన తన నివాసం నుండే ప్రశ్నించడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో తాజా సమావేశాలు ఏకపక్షంగా మారనున్నాయి.
అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడాలి : – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
‘ప్రతిపక్షహోదాతో సంబంధం లేకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల తరపున నిలబడి పోరాడటం వారి బాధ్యత. ఆ బాధ్యత నుంచి తప్పుకుని సమావేశాలు బహిష్కరించడం సరైంది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే కాకుండా అధికార పక్షానికి మేలు చేకూరుస్తుంది. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ దృష్టిలో పెట్టుకోవాలి. అధికార, ప్రతిపక్షాల సమాహారంగా ఉండాల్సిన అసెంబ్లీ ఏకపక్షంగా జరగడం వల్ల ప్రజాసమస్యల పరిష్కారానికి ఏమాత్రం తోడ్పడదు. ప్రతిపక్ష పార్టీ పనిచేయడానికి వీలైన వాతావరణాన్ని అసెంబ్లీలో కల్పించాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది’ అని అన్నారు.
నిలదీస్తామనే : రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
‘వైసిపి సభ్యులకు అసెంబ్లీలో గత సమావేశంలో మైకు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఇస్తాము. సభకు వచ్చి వారి అభిప్రాయాలు చెప్పాలి. మైకు ఇవ్వలేదనడం సరికాదు. హోదాలతో పనిలేదు. సభకు వచ్చి వారి అభిప్రాయం చెప్పడానికి ఇబ్బంది ఏమిటి. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, నియంతృత్వ పోకడలపై నిలదీస్తామనే వారు సభకు రావడం లేదు’
వెళ్లడం ఎందుకు ? : వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
అసెంబ్లీలో సమస్యలపై చర్చించేందుకు సమయం కావాలి. ప్రతిపక్ష హోదా లేనప్పుడు అది సాధ్యం కాదు. అందువల్లే సమావేశాలకు వెళ్లడం లేదు. స్పీకర్ అనుసరిస్తున్న తీరు కూడా సరిగాలేదు. అందువల్లే మేము సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం.’
ప్రజలకు నష్టం :సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పదవులెందుకు?
‘అసెంబ్లీలో నాలుగు పార్టీలు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఉంది. వైసిపి ఒక్కటే ప్రశ్నించే స్థానంలో ఉంది. అది కూడా సమావేశాలకు వెళ్లపోతే ప్రశ్నకు తావుండదు. అధికారపార్టీకి అడిగేవారు లేకపోతే ఆనందంగానే ఉంటుంది. వారికి తోచిన విధంగా సమావేశాలు జరుపుకుని వెళ్లిపోతారు. ఏమైనా కమ్యూనిస్టులు చట్టసభలో లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టం ఏమిటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సి ఉంది.’
పదవులెందుకు? : ఎపిసిసి అధ్యక్షులు వై.ఎస్.షర్మిల
‘చట్టసభలకు ఎన్నికైన వారు అసెంబ్లీకి వెళ్లి సమస్యలను ప్రస్తావించాలి. అలా వెళ్లనప్పుడు వారికి పదవులెందుకు. వాటికి రాజీనామా చేయాలి. అసెంబ్లీని గౌరవించని వ్యక్తులు సభ్యులుగా ఉండటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. సభకు వెళ్లనిపక్షంలో వైసిపి సభ్యులు రాజీనామాలు చేయాలి’
ముఖం చాటేస్తున్నారు : బిజెపి అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం
‘వైసిపి అవినీతిని ప్రశ్నిస్తారనే సమాధానం చెప్పుకోలేని స్థితిలో జగన్‌మోహన్‌రెడ్డి ముఖం చాటేస్తున్నారు. గెలిచినప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై పోరాడాలి.’
సభకు వెళ్లి మాట్లాడాలి : మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడటం సరికాదు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ ప్రతినిధిగా అతను సభకు వెళ్లాలి. తన అభిప్రాయం చెప్పాలి. సభను గౌరవించే లక్షణం లేనప్పుడు సభ్యుడుగా ఉండటం కూడా మంచిది కాదు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజానుకూలంగా ఏమీ ఉండటం లేదు. కనుక సభ్యులు అందరూ హాజరై సభ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.
సామంతరాజులు కాదు : ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాసరావు
చట్ట సభలకు హాజరై ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రజా ప్రతినిధుల పని.శాసనసభకు హాజరు కాబోమని చెప్పడానికి వీళ్లు సామంతరాజులు కాదు. రాజ్యాంగంలో వీరికి ప్రత్యేకంగా డ్యూటీలు ఏమీ కేటాయించలేదు. సభలకు వెళ్లడం మాని మీడియాకు వాధనలు వినిపిస్తామనడం సరైంది కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి…విభజన హామీలు అమలు చేయలేదు. రాజధాని అమరావతికి నిధులు లేవు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి వీటిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంది.