విద్యుత్‌ ఒప్పందాలపై చర్చకు అసెంబ్లీ సమావేశాలు

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ప్రభుత్వం అదానీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని, ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ ఒప్పందాలు, అదాని పేరు ప్రస్తావించకుండా, మాజీ సిఎం జగన్‌ అవినీతిపై ఎసిబి దర్యాప్తు చేయించాలంటూ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు. విద్యుత్‌ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల భారం పడుబోతుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రం కొంటున్న విద్యుత్‌ రాజస్థాన్‌లో ఉత్పత్తి చేయడంతో, ఆ రాష్ట్రంలో 14 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని, పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.8 వేల కోట్లు ఆదాయం లభిస్తోందని చెప్పారు. ప్రయోజనాలు రాజస్థాన్‌కు కల్పిస్తూ, భారం మాత్రం రాష్ట్ర ప్రజలపై వేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో పరిపాలన నిష్పక్షపాతంగా సాగడం లేదని అన్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ వెళ్లి షిప్‌ను సీజ్‌ చేయమని ఆదేశించడం హర్షణీయమన్నారు. పక్కనే ఉన్న గంగవరం పోర్టులోనూ ఇదే తంతు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వలంటీర్లకు నెలకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇచ్చేందుకు సిఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి హరినాథరెడ్డి, ఎ వనజ పాల్గొన్నారు.

➡️