సిపిఎస్‌ రద్దుకు అసెంబ్లీలో తీర్మానం

  • ఎపిసిపిఎస్‌ఇఎ సభలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సిపిఎస్‌) రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి సభ్యునిగా నూతనంగా ఎన్నికైన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఎపి సిపిఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఎపిసిపిఎస్‌ఇఎ) ఆధ్వర్యాన విజయవాడలోని ధర్నా చౌక్‌లో మంగళవారం సభ జరిగింది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గోపిమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు. సిపిఎస్‌ రద్దు కోసం జరిగే పోరాటానికి పిడిఎఫ్‌ అండగా ఉంటుందని చెప్పారు. సిపిఎస్‌ రద్దు కోసం యుటిఎఫ్‌ నిర్వహించిన పాదయాత్ర, మోటార్‌ సైకిల్‌ ర్యాలీలలో తాను పాల్గొన్నానని వివరించారు. భవిష్యత్తులో సిపిఎస్‌ రద్దుకోసం జరిగే పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానని వెల్లడించారు. సిపిఎస్‌ ఉద్యోగుల గళాన్ని శాసనమండలిలో కూడా వినిపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు సిపిఎస్‌ను కేంద్ర రద్దు చేస్తుందో, రాష్ట్రం రద్దు చేస్తుందో తేల్చుకోవాలని చెప్పారు.తమకు మాత్రం ఓపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు చేసేందుకు ఆలోచన చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా హామీ ఇచ్చారని, ఇందుకు అనుగుణంగా సిఎం, మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎపిజెఎసి చైర్మన్‌ శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులను న్యాయం చేయాలని కోరారు. ఎపిటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం సిపిఎస్‌ ఉద్యోగులపై పెట్టిన కేసులను తొలగిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. ఎపిసిపిఎస్‌ఇఎ అధ్యక్ష కార్యదర్శులు సతీష్‌, సిఎం దాస్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తక్షణమే చర్చలను జరిపి తమకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయాలని కోరారు. ఎస్‌టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్‌, రఘునాథరెడ్డి, ఎపిజిఇఎ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్‌రాజు, ఆస్కారావు, ఎపి సచివాలయం సిపిఎ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట్ల రాజేష్‌, ఎపిటిఎఫ్‌ 257 ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జానీభాషా తదితరులు ఈ సభకు మద్దతు తెలిపారు.

➡️