– సిపిఎం ప్రజా చైతన్య యాత్రలు
ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు ఆదివారం ప్రకాశం, పశ్చిమగోదావరి, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో సాగాయి. ఈ సందర్భంగా సిపిఎం నేతలు ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద నుంచి ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర నరసాపురం పట్టణం, యలమంచిలి మండలం మీదుగా పాలకొల్లుకు చేరుకుంది. ఈ యాత్రకు జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ నాయకత్వం వహించారు. పలుచోట్ల ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తూ.. ఆయా సమస్యలను పరిశీలిస్తూ యాత్ర ముందుకు సాగింది. యలమంచిలి మండలం చించినాడలో దళితుల శ్మశానవాటికను ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా ఓ భూస్వామి తవ్విన రొయ్యల చెరువును తక్షణం పూడ్పించాలని ఆర్‌డిఒ దాసురాజు దృష్టికి గోపాలన్ తీసుకెళ్లారు. వారం రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోతే తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. విజయవాడలోని వాంబే కాలనీ ‘ఇ’ బ్లాక్, కృష్ణలంక 21, 22వ డివిజన్‌లలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. శానిటేషన్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, దోమల బెడద అధికంగా ఉందని, మంచినీటి పైపుల్లో మురుగునీరు సరఫరా అవుతోందని స్థానికులు తెలిపారు. తాగేందుకు మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తుందని నేతల ఎదుట వాపోయారు. విద్యుత్ బిల్లులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జెఎన్‌ఎన్‌యు ఆర్‌ఎం, టిడ్కో గృహాలను లబ్దిదారులమైన తమకు అప్పగించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాన్‌హోల్స్ పొంగి పొర్లుతున్నాయని, కరకట్ట దిగువున కుక్కల బెడద ఎక్కువైందని, గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ యాత్రల్లో భాగంగా 21వ డివిజన్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, 22వ డివిజన్‌లో సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కె.దుర్గారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎ.కొండూరు మండలం పాత కొండూరు దళితపేట పేద రైతులు, కూలీలు తమకు భూ సమస్యను సిపిఎం నేతల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ ఈ నెల 24న తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేయాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని మిట్టపాలెంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. రహదారులు, మంచినీరు, డ్రెయినేజీ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కేజీ మస్తాన్, బి.రఘురామ్, కంకణాల రమాదేవి పాల్గన్నారు. చీమకుర్తిలోని రామ్‌నగర్ కాలనీ, సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట, శాంతినగర్, అంబేద్కర్ నగర్, ఎన్‌టిఆర్ కాలనీ, ఉత్తర బజార్‌లో సిపిఎం నేతలు పర్యటించారు. నెల్లూరులోని 54వ డివిజన్, జనార్థన్‌రెడ్డి కాలనీ, లక్ష్మీపార్వతి నగర్ ప్రాంతాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు ఎం ప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
